- రాజ్యసభలో చర్చిస్తాం.. కేంద్రాన్ని కోరుతాం
- జూన్ 2తో ముగియనున్న పదేండ్ల గడువు
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి జూన్ 2వ తేదీతో పదేండ్లు పూర్తవుతుంది. విభజన చట్టం ప్రకారం పదేండ్ల వరకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామని అన్నారు.
ఏపీకి ప్రత్యేకహోదాపై నిన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పోరాడుతుందన్నారు. విభజన హామీలపై రాజ్యసభలో ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ప్రభుత్వం బలంగా ఉన్నంత వరకు ప్రత్యేక హోదా కష్టమేనని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సత్సంబంధాలు అవసరమన్నారు. ఈ క్రమంలో వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలంగాణలో మరోసారి ఏపీ నేతల కన్ను పడిందనే చర్చ మొదలైంది.
Also Read:ఫిబ్రవరి 15న వాలంటీర్లకు వందనం కార్యక్రమం