హైదరాబాద్ కిరాణా షాపుల్లో గంజాయి చాక్లెట్లు : సద్గురుసాయి ఆయుర్వేదిక్ ఫార్మసీలో తయారీ

హైదరాబాద్ సిటీ నడిబొడ్డులోని కిరాణా షాపుల్లోకి వచ్చేశాయి గంజాయి చాక్లెట్లు.. పిప్పరమెంట్లు అమ్మినట్లు గంజాయి చాక్లెట్లు అమ్మేస్తున్నారు వెధవలు. సిటీలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ బస్తీలో వెలుగు చూసిన ఘటన సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

కిరాణా షాపుల్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారన్న సమాచారంతో.. బాలానగర్ SOT పోలీసులు పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే.. రింగ్ బస్తీలోని ఓ కిరాణా షాపులో 14 కేజీల.. 59 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ షాపును బీహార్ రాష్ట్రానికి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. వలస కూలీలు, గంజాయి బ్యాచ్ లక్ష్యంగా.. ఈ చాక్లెట్లను అమ్ముతున్నట్లు చెబుతున్నారు పోలీసులు.

బీహార్ రాష్ట్రానికి చెందిన సునీల్ కిరాణా షాపులో ఏకంగా 2 వేల 400 గంజాయి చాక్లెట్లు సీజ్ చేయటం కలకలం రేపుతోంది. ఒక్కో చాక్లెట్ ను 40 రూపాయలకు అమ్ముతున్నాడు. కొంత కాలంగా రహస్యంగా ఈ దందా సాగిస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు., సీజ్ చేసిన చాక్లెట్ల విలువ 46 వేల రూపాయల వరకు ఉంటుందని.. వేల రూపాయల విలువైన గంజాయి చాక్లెట్లను ఇప్పటికే అమ్మినట్లు కూడా గుర్తించారు పోలీసులు. గంజాయి మాఫియా నుంచి ఈ చాక్లెట్లను కొనుగోలు చేసినట్లు చెబుతున్నాడు వ్యాపారి సునీల్ కుమార్. యూపీలోని సద్గురుసాయి ఆయుర్వేదిక్ ఫార్మసీ అనే కంపెనీలో వీటిని తయారు చేస్తున్నట్లు వెల్లడించారాయన. ఈ కంపెనీ కూడా ఉత్తరప్రదేశ్ లో ఉన్నట్లు వివరించారు. వాళ్లపైనా కేసులు నమోదు చేసినట్లు వివరించారాయన. 

అతని ఇచ్చిన సమాచారం ఆధారంగా.. గంజాయి మాఫియా గుట్టురట్టు చేసే పనిలో ఉన్నారు పోలీసులు. హైదరాబాద్ సిటీలో ఇంకా ఏయే కిరాణా షాపుల్లో ఇలాంటి గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు అనేది విచారణలో తెలుస్తుందని స్పష్టం చేశారు బాలానగర్ ఏసీపీ హనుమంతరావు.