తిరుపతి ఎయిర్‌పోర్టులో హైదరాబాద్ ప్రయాణికుల ఆందోళన

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ టూ తిరుపతి.. తిరుపతి టూ హైదరాబాద్ విమానం ఆలస్యం విషయంలో ఎయిర్ పోర్టు సిబ్బంది తీరును ప్రయాణికుల ఆగ్రహానికి కారణం అయ్యింది. 2024, నవంబర్ 12వ తేదీ ఉదయం 8 గంటల 15 నిమిషాలకు తిరుపతి నుంచి హైదరాబాద్ విమాన సర్వీస్ ఉంది. ఈ విమానంలో వెళ్లేందుకు 45 మంది ప్రయాణికులు ఉదయం 7 గంటలకే ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. 

ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు వచ్చినప్పటి నుంచి సిబ్బంది నుంచి ఎలాంటి సమాచారం లేదు. అసలు విమాన సర్వీస్ ఉందా లేదా.. నడుస్తుందా లేదా.. ఆలస్యంగా బయలుదేరుతుందా ఏంటీ.. కారణం ఏంటీ అనే కనీస సమాచారం ఇవ్వలేదు ఎయిర్ పోర్టు సిబ్బంది.

విమాన సర్వీస్ రద్దు అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ఎయిర్ పోర్టు అధికారులు సైతం.. ఎలాంటి సమాచారం ఇవ్వకపోవటంతో ఆందోళనకు దిగారు ప్రయాణికులు. ఉదయం 7 గంటల 15 నిమిషాలకు హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చే విమానం.. తిరిగి మళ్లీ 8 గంటల 15 నిమిషాలకు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. ఆ విమాన సర్వీసుపైనే ఇప్పుడు ఎయిర్ పోర్టు అధికారులు సమాచారం ఇవ్వటం లేదని.. అసలు సర్వీస్ ఉందా లేదా అనేది కూడా చెప్పటం లేదని ప్రయాణికులు గొడవకు దిగారు. ఈ విషయంలో ఎయిర్ పోర్ట్ అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేకపోవటంతో.. గందరగోళంలో ఉన్నారు ప్రయాణికులు.