ప్రీ లాంచ్ మోసం : రూ. 70 కోట్లు ముంచిన హైదరాబాద్ క్రితికా ఇన్ ఫ్రా డెవలపర్స్

 హైదరాబాద్ లోని బోడుప్పల్ లో  ఫ్రీ లాంచ్ పేరుతో  రియల్ ఎస్టేట్ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. అపార్ట్ మెంట్లో ప్లాట్ కట్టిస్తామని 170 మంది బాధితుల నుంచి రూ.70 కోట్ల వరకు వసూలు చేసింది  క్రితికా ఇన్ ఫ్రా డెవ్ లపర్స్ సంస్థ. ఒక్కొక్కరి  దగ్గర  రూ.40 లక్షల నుంచి 60 లక్షల వరకు వసూలు  చేసి  నాలుగు సంవత్సరాలవుతున్నా ..  ఫ్లాట్స్ ఇవ్వడం లేదంటూ బాధితులు ఆందోళనకు దిగారు. తమ  డబ్బులు  తిరిగివ్వాలని లేకపోతే ఫ్లాట్స్ అయినా కట్టివ్వాలని డిమాండ్ చేశారు. తమకు రిజిస్ట్రేషన్ చేసిన ఫ్లాట్స్ ను ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఉప్పల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు  బాధితులు ధర్నాకు దిగారు.  సంస్థ సుమారు 70 కోట్ల వరకు మోసం చేసిందని ఆరోపిస్తున్నారు.

ALSO READ | సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చల్లటి కబురు.. HCL ఉద్యోగులు పండగ చేస్కోండి..

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని హేమానగర్లో రెండున్నర ఎకరాల స్థలాన్ని 2020 లో కొనుగోలు చేస్తున్నానని  క్రితిక ఇన్ఫ్రా డెవలపర్స్ సీఈఓ శ్రీకాంత్ రూ. 54 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశాడు. కానీ శ్రీకాంత్ 2 ఎకరాల స్థలం మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ స్థలాన్ని 140 మందికి రిజిస్ట్రేషన్ చేయించాడు. కానీ ఇంకా 40 మందికి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయలేదు.  డబ్బులు కట్టి ఐదు సంవత్సరాలు అవుతున్నా మాకు ఎలాంటి పొజిషన్ ఇవ్వడం లేదు, అపార్ట్మెంట్ కట్టి ఇవ్వడం లేదు. మాకు రిజిస్ట్రేషన్  చేసిన స్థలాన్ని మళ్ళీ మిగతా 40 మందికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడని తెలిసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు వచ్చాం. దీనిపై పోలీసులను ఆశ్రయిస్తే సివిల్ మ్యాటర్ అంటూ దాటవేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చొరవ చూపి మా డబ్బులు మాకు ఇప్పించాలి  లేదా మా అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ అయినా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు బాధితులు.