హైదరాబాద్, వెలుగు: ఆఫీస్ స్పేస్ బిజినెస్‌లో సిటీ సత్తా చాటింది. 2022 క్యాలెండర్ ఇయర్లో 67 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ జాగా అమ్ముడయింది. హైదరాబాద్ వాణిజ్య మార్కెట్ ఆఫీస్ లావాదేవీలు 12శాతం పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ తెలిపింది. దీని రిపోర్ట్ ప్రకారం.. భారతదేశంలోని టాప్ ఎనిమిది మార్కెట్లలో హైదరాబాద్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం డిమాండ్‌ను బాగా పెంచింది. ఐటీ రంగం విస్తరణ ప్రణాళికలను వాయిదా వేయడంతో 2022 రెండవ సగం (హెచ్2)లో అమ్మకాలు తగ్గాయి. యాన్యువల్ ఆఫీస్ కంప్లీషన్స్ వార్షికంగా 146శాతం పెరిగి 11.2 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నాయి. గడచిన పదేళ్లలో నగరంలో ఇదే అత్యధికం. మొత్తం ఆఫీస్ సప్లైలో దాదాపు 92శాతం పశ్చిమ హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉంది.
2022లో హైదరాబాద్‌లో సగటు లావాదేవీల అద్దెలు 6శాతం పెరిగాయి. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ కూడా 2022 సంవత్సరంలో బలపడింది. అమ్మకాల జోరును కొనసాగించింది. నగరంలో 31,046 ఇండ్లు అమ్ముడయ్యాయి. సేల్స్ వార్షికంగా 28శాతం పెరిగాయి. 2011 నుంచి నగరంలో ఇంతటి అమ్మకాలు ఇదే తొలిసారి కాగా, కొత్తగా 43,847 యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి సగటు ధరలు 6శాతం వార్షికంగా పెరిగాయి. హెచ్1లో ఆఫీస్ లావాదేవీల పరంగా, హైదరాబాద్ 3.5 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరిగింది. అయితే హెచ్2లో అమ్మకాలు 20శాతం (వార్షికంగా) తగ్గాయి. హెచ్2లో జరిగిన లావాదేవీల్లో ఐటీ పరిశ్రమ వాటా 31శాతం ఉంది.
