చైనాకు చెందిన లాంబో.. అతనికి సహకరించిన కర్నూలుకు చెందిన నాగరాజు అరెస్ట్
హైదరాబాద్: అడగకున్నా ఆన్ లైన్ లో లోన్ మంజూరు చేసి ఆ తర్వాత రోజువారీ వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్న ఇన్ స్టంట్ లోన్ యాప్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సైబర్ క్రైమ్ పోలీసులకు కొత్త కొత్త విషయాలు తెలిసొస్తున్నాయి. తవ్వేకొద్దీ పుట్టలు పుట్టలుగా కొత్తకొత్త ఫ్రాండ్ యాప్ లు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు 27 కేసులు నమోదు చేసి 16 మందిని అరెస్టు చేశారు పోలీసులు. పట్టుబడిన నిందితుల విచారణ సందర్భంగా మరిన్ని ఛీటింగులు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ లో ఇన్ స్టంట్ లోన్ యాప్స్ 40 వరకు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడుగా అనుమానిస్తున్న చైనాకు చెందిన లాంబోను ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారు. 4 కంపెనీలు ఏర్పాటు చేసి లోన్ యాప్స్ నడుపుతున్న లాంబో చైనాకు పారిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. లాంబో ఇక్కడ కాలు పెట్టక ముందు నుండి కార్యకలాపాలు నడిపే వరకు పూర్తిస్థాయిలో సహకరించిన కర్నూలుకు చెందిన నాగరాజు కూడా లాంబో వెంట ఉండడంతో పోలీసులు అతడ్ని కూడా అరెస్ట్ చేశారు. లాంబో 150 ఇన్ స్టంట్ లోన్ యాప్స్ ద్వారా 6 నెలల కాలంలో రూ.21 వేల కోట్ల లావాదేవీలు జరిపినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇండియా నుంచి పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులు మళ్లించినట్లు తేలడంతో ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు సీసీఎస్ పోలీసులు కేంద్రానికి సమాచారం ఇచ్చారు.
డిజిటల్ లోన్ యాప్ లను నమ్మొదు – హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్
డిజిటల్ లోన్ ఇచ్చే ఇన్ స్టంట్ యాప్ లను ఎవరూ నమ్మొద్దని హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ సూచించారు. విచారణలో అనేక రకాలుగా మోసాలు చేస్తున్నట్లు బయటపడుతోందని.. పూర్తిగా స్పష్టత రావాల్సి ఉందన్నారు. అత్యవసరమైన వారు లోన్ ఇచ్చే యాప్ లు ఆర్బీఐ రూల్స్ పాటిస్తున్నాయా లేదా చూసుకోవాలని ఆయన సూచించారు. లోన్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు.
