సైబర్ నేరాల్లో రూ. 155 కోట్లు రీఫండ్

  • లోక్ అదాలత్ ద్వారా 17 వేలమంది బాధితుల అకౌంట్లలో జమ 

హైదరాబాద్, వెలుగు: సైబర్‌‌ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు ఊరట లభిస్తున్నది. బాధితులు పోగొట్టుకున్న క్యాష్​ను తిరిగి ఇప్పించడంపై రాష్ట్ర సైబర్‌‌ సెక్యూరిటీ బ్యూరో(సీఐబీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఫ్రీజ్ చేసిన డబ్బును బాధితులకు తిరిగి అందజేస్తున్నది. ఇందులోభాగంగా శనివారం నిర్వహించిన మెగా లోక్‌‌ అదాలత్‌‌లో మొత్తం 4,893 మంది బాధితులకు రూ.33.27 కోట్లను రీఫండ్‌‌ రూపంలో వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 14 వరకు మొత్తం 17,210 మంది బాధితులకు రూ.155.22 కోట్లను రీఫండ్‌‌ చేసింది. ఈ మేరకు టీజీసీఎస్‌‌బీ డైరెక్టర్‌‌ శిఖాగోయల్‌‌ ఆదివారం ఓ ప్రకటనలో రీఫండ్స్ వివరాలను వెల్లడించారు. సైబర్ నేరాల్లో బాధితులు కోల్పోయిన డబ్బును లోక్ అదాలత్ ద్వారా వారివారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు.

సైబరాబాద్ లో ఎక్కువ సైబర్ నేరాలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ కమిషనరేట్లతో పోల్చితే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ సైబర్ నేరాలు నమోదు అవుతున్నాయి. ఇక్కడ నమోదైన 2,136 కేసుల్లో రూ.12,77,49,117 లు ఫ్రీజ్ చేసి బాధితులకు అందించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌‌ కమిషనరేట్‌‌ పరిధిలో 268 కేసులకు గాను రూ.8,84,17,621, రాచకొండ యూనిట్ పరిధిలో 592 కేసుల్లో రూ.4,53,06,114, టీజీసీఎస్‌‌బీ పరిధిలో 60 కేసులలో రూ1,06,49,044, సంగారెడ్డి జిల్లా పరిధిలో నమోదైన సైబర్‌‌ కేసులలో 188 మంది బాధితులకు రూ. 98,63,438 రీఫండ్‌‌ చేశారు. టీజీసీఎస్‌‌బీ అధికారులు, తెలంగాణ స్టేట్‌‌ లీగల్‌‌ సర్వీసెస్‌‌ అథారిటీ (టీజీఎల్‌‌ఎస్‌‌ఏ), జిల్లా జడ్జిలు, మేజిస్ట్రేట్, జిల్లా లీగల్‌‌ సర్వీసెస్‌‌ అథారిటీ అధికారులు, పోలీస్‌‌ కమిషనర్లు, జిల్లాల ఎస్పీ సహకారం..సమన్వయంతోనే సాధ్యమైందని డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు. సైబర్‌‌ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్​కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.