టీమిండియా 9 మందితోనే ఆడుతోంది.. ఈ మాటంటే వారిద్దరి అభిమానులు ఓర్చుకోలేరు: సీవీ ఆనంద్

బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో టీమిండియా వెనుకబడిన విషయం తెలిసిందే. పెర్త్ గడ్డపై విజయం సాధించి టెస్ట్ సిరీస్‌ను ఘనంగా ఆరంభించినా.. ఆ తరువాత రెండింట ఓడి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 2-1 తేడాతో వెనుకబడింది. ప్రస్తుత భారత జట్టులో అతి పెద్ద సమస్య.. సీనియర్లు రాణించకపోవడం. ఈనేపథ్యంలో టీమిండియా ఓటములపై కొందరు నెటిజన్లు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌‌కు కొన్ని ప్రశ్నలు సంధించగా.. ఆయన నిర్మొహమాటంగా సమాధానాలు ఇచ్చారు.

ఆ ఇద్దరి ఆర్మీలు నన్ను ట్రోల్ చేస్తాయి..: సీవీ ఆనంద్

ప్రత్యర్థి జట్టు 11 మందితో ఆడుతుంటే భారత జట్టు 9 మందితోనే ఆడుతుందని సీవీ ఆనంద్‌ సెటైర్లు వేశారు. జట్టులో మరో ఇద్దరు ఉన్నా.. లేనట్టే అని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ఆ ఇద్దరు మరెవరో కాదు.. రోహిత్, కోహ్లీలే. ఈ మాటంటే వీరి అభిమానులకు ఎక్కడలేని కోపం పొడుచుకొస్తుందని సీవీ ఆనంద్ చెప్పుకొచ్చారు. వారి సోషల్ మీడియా ఆర్మీలు వ్యక్తిగతంగా ట్రోలింగ్‌కు దిగుతాయని అన్నారు. అందువల్ల వీరి పేర్లను ఆయన ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు.

అగ్రశ్రేణి జట్ల చేతిలో టీమిండియా పదే పదే ఓడిపోతున్న విషయాన్ని సీవీ ఆనంద్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత ఆసీస్ పర్యటనలో కుర్రాళ్లతో టీమిండియా విజయం సాధిస్తే.. ఇప్పుడు జట్టులో పేరు మోసిన ఆటగాళ్లున్నా పొడిచింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఓ అభిమానిగా ఈ ఓటములను జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని అన్నారు. స్టార్ ఆటగాళ్లంటే జట్టుకు అవసరమైనప్పుడు మంచి ప్రదర్శన చేసి అభిమానుల్లో తమ ఆదరణ తగ్గకుండా చూసుకోవాలని మరో ప్రశ్నకు సీవీ ఆనంద్ బదులిచ్చారు.

 
సీవీ ఆనంద్ మాటల్లో వాస్తవం లేకపోలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో ఉన్నారన్న పేరు తప్ప.. ఆటలో వారి పాత్ర శూన్యం. సిరీస్ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా భాధ్యతారాహిత్యంగా ఆటాడుతున్నారు. ఓ వైపు అదే పిచ్‌లపై జూనియర్లు సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నా.. వీరు మాత్రం క్రీజులో పట్టుమని పది నిమిషాలు కూడా నిలదొక్కుకోలేకపోతున్నారు. వీరు రాణించకపోవటం టీమిండియాను బాగా దెబ్బతీస్తోంది.