హైదరాబాద్: పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్(9)ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాలుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.13 రోజులుగా కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ్ మృత్యువుతో పోరాడుతున్నాడు. శ్రీతేజ్ను సీపీ ఆనంద్ పరామర్శించిన సమయంలో ఆయన వెంట వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా కూడా ఉన్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యంపై కిమ్స్ వైద్యులను సీపీ, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా అడిగి తెలుసుకున్నారు.
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్బంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. రెండు వారాలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారు. శ్రీతేజ్ ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్‌లో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ తన కొడుకును చూసేందుకు రాలేదని, అయితే, హాస్పిటల్ బిల్లులు మాత్రం కడుతున్నారని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు.
ALSO READ | పునరావాసం కల్పించిన తర్వాతే మూసీ పనులు ప్రారంభించాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
అల్లు అర్జున్ పుష్ప-2 ప్రీమియర్ షోకురాత్రి 9:30 కు సంధ్య థియేటర్కు రాగా.. ఆయన లోపలకు వెళ్లడానికి పోలీసులు, బౌన్సర్లు, పర్సనల్సెక్యూరిటీ అందరినీ చెదరగొట్టి రూట్క్లియర్చేశారు. ఈ క్రమంలో బయటి నుంచి లోపలకు వచ్చేందుకు చాలామంది అభిమానులు దూసుకువచ్చారు. అప్పటికే థియేటర్‌లోపల ఒకవైపు భాస్కర్ అతడి కూతురు, మరోవైపు రేవతి, ఈమె కొడుకు శ్రీతేజ్ ఉన్నారు. బన్నీవస్తున్నాడని తెలుసుకుని లోపలున్న అభిమానులంతా తోసుకురాగా వారితో పాటు శ్రీతేజ్ కూడా పరిగెత్తాడు. కొడుకును పట్టుకునే క్రమంలో తల్లి రేవతి కూడా వెంట పరుగెత్తింది. దీంతో శ్రీతేజ్కిందపడగా అభిమానులంతా అతడిని తొక్కుకుంటూ వెళ్లారు.
శ్రీతేజ్ను కాపాడుకునే ప్రయత్నంలో రేవతి కూడా ప్రేక్షకుల కాళ్ల కింద నలిగిపోయింది. మరికొంతమంది కూడా గాయపడ్డారు. ఈ దశలో అక్కడే ఉన్న పోలీసులు.. అరుపులు, కేకలు విని అందరినీ చెదరగొట్టారు. స్పృహ తప్పిన రేవతి, అతడి కొడుకును బయటకు తీసుకువచ్చి సీపీఆర్ చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోవడంతో రేవతిని డీడీ హాస్పిటల్కు తరలించారు. అక్కడే రేవతి ప్రాణం పోయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజ్ను పోలీసులు హుటాహుటిన కిమ్స్దవాఖానకు తరలించారు. అప్పటి నుంచి ఆ పిల్లాడికి కిమ్స్లో చికిత్స అందిస్తున్నారు.