- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆపరేషన్స్
- ఎయిర్పోర్ట్ ప్రెడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు
- రద్దీ, సెక్యూరిటీ చెకింగ్ వంటి వాటిపై విశ్లేషణ
- అందుకనుగుణంగా ఎయిర్‌లైన్స్ సంస్థలు, సిబ్బందికి సూచనలు
- తగ్గనున్న ప్రయాణికుల చెకిన్ టైమ్
హైదరాబాద్, వెలుగు : శంషాబాద్ ఎయిర్‌పోర్టు అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎయిర్‌పోర్టుగా రికార్డులకెక్కింది. విమానాల రాకపోకలు, ప్రయాణికుల సంఖ్య, ఎయిర్‌పోర్టులో రద్దీ తదితర వివరాలన్నింటినీ ఏఐ ద్వారా ట్రాక్ చేయనున్నారు. అందుకు ఎయిర్‌పోర్టులో ‘ఎయిర్పోర్ట్ ప్రెడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ (ఏపీవోసీ)’ని తాజాగా ప్రారంభించారు. దీంతో దేశంలో ఏఐ ఆపరేషన్స్ ప్రారంభించిన తొలి ఎయిర్‌పోర్టుగా శంషాబాద్ విమానాశ్రయం నిలిచింది. ఈ సిస్టమ్ ద్వారా విమానాల ట్రాఫిక్, ప్రయాణికుల సంఖ్య, పార్కింగ్ వంటి విషయాలన్నింటినీ ఒకే ప్లాట్‌ఫామ్ కిందికి తీసుకొచ్చి.. రియల్ టైం డేటా ద్వారా విశ్లేషించనున్నారు. ఏపీవోసీతో ఎయిర్‌పోర్టు ఆపరేషన్లు ఈజీ అవుతాయని అధికారులు చెప్తున్నారు.
ముందే భవిష్యత్తు సవాళ్లు గుర్తింపు
ఎయిర్‌లైన్స్, గ్రౌండ్ స్టాఫ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ఏపీవోసీ డేటా సేకరిస్తుంది. దీంతో భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ముందే గుర్తిస్తుంది. అదేవిధంగా, ఎయిర్‌పోర్టులోని సీసీటీవీలు, వైఫై రూటర్లు, బ్యాగేజీ కౌంటర్లు, సిమ్యులేషన్ మోడల్స్ ఆధారంగా.. ఎయిర్‌లైన్స్ ఆపరేటర్లను ఏపీవోసీ అలర్ట్ చేస్తుంది. ఎయిర్‌లైన్స్ ట్రాఫిక్ ఎంత ఉంది? ఎన్ని విమానాలు నడుస్తున్నాయి? ఎంత మంది ప్రయాణికులు వస్తున్నారు? ఏ గేట్ వద్ద రద్దీ ఎక్కువుంది? వంటి వివరాలను ఏపీవోసీ ద్వారా విశ్లేషించనున్నారు. ఇలా చేయడంతో ప్రయాణికుల చెకిన్ టైమ్, సెక్యూరిటీ క్యూలను తగ్గించొచ్చని అధికారులు చెప్తున్నారు.
Also Read : చలి పంజా.. గజగజలాడుతున్న ఉత్తర తెలంగాణ
ఇంటెలిజెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్
ఇటీవలి కాలంలో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతున్నది. తక్కువ టైంలో చేరుకోవడం, సౌకర్యవంతమైన ప్రయాణం ఉంటుండటంతో చాలా మంది ఫ్లైట్ జర్నీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ పెరుగుతున్నది. చెక్ ఇన్, సెక్యూరిటీ చెక్, బ్యాగేజ్ కౌంటర్ వద్ద ఎక్కువ రద్దీ ఉంటున్నది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల సంఖ్యపై రియల్ టైం డేటాను ఏపీవోసీ తీసుకుంటున్నది. దానికి అనుగుణంగా ఎయిర్‌పోర్టు సిబ్బందిని అలర్ట్ చేస్తున్నది. ప్రయాణికులు టైంకు ఫ్లైట్‌ను అందుకునేలా దోహదం చేస్తున్నది.
ఫ్లో అండ్ క్యూ అనలిటిక్స్
ఇందులో టెర్మినల్ ఆపరేషన్లను మేనేజ్ చేస్తున్నారు. ఏ టైమ్‌లో ఏ విమానం వస్తున్నది? గంటకు గంటకు ఎన్ని విమానాలు టెర్మినల్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి? ఏ సంస్థ.. ఎన్ని విమానాలు నడుపుతున్నది? వంటి లెక్కలను ఏపీవోసీ విశ్లేషిస్తున్నది. దీంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు, ఎయిర్‌పోర్టు అధికారులకు ట్రాఫిక్ వివరాలను పంపించి.. అందుకు అనుగుణంగా విమానాలకు రన్‌వే క్లియరెన్స్‌లు ఇస్తారు.
ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్ అనలిటిక్స్
ఎయిర్‌పోర్టుకు సాధారణ వ్యక్తులతో పాటు చాలా మంది దివ్యాంగులు, వృద్ధులు, పేషెంట్ల వంటి ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులూ వస్తుంటారు. అలాంటి వారిని గుర్తించేందుకు ఏపీవోసీ రియల్‌టైం డేటాను విశ్లేషిస్తుంది. వెంటనే ఎయిర్‌పోర్టు సిబ్బందిని అలర్ట్ చేసి వారికి సాయం చేసేందుకు దోహదం చేస్తుంది.
రియల్‌టైం ఇన్సైట్స్
విమానం ల్యాండ్ అయ్యాక లేదా టేకాఫ్ అవ్వడానికి ముందు ప్రయాణికులను విమానాల వద్దకు బస్సులు చేరవేస్తుంటాయి. ఆ బస్సులు టెర్మినల్ వద్ద ఆగేందుకు తక్కువ టైం ఉంటది. ఒక్కోసారి రష్ను బట్టి ఎక్కువ సేపు ఆగుతుంటాయి. అలాంటి ఇన్సిడెంట్లను రియల్‌టైం డేటా ఆధారంగా ఏపీవోసీ గుర్తిస్తుంది. వెంటనే సిబ్బందిని అలర్ట్ చేస్తుంది. దీనిని నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది.
బిహేవియర్ అనలిటిక్స్
ఎయిర్‌పోర్టులో భద్రత, ప్రయాణికుల ప్రవర్తన తీరునూ తెలుసుకునేందుకూ ఏపీవోసీ డేటా సేకరిస్తుంది. సెక్యూరిటీ చెకింగ్ వద్ద ప్రయాణికుల తీరు, వారి ప్రవర్తన ఎలా ఉంది? వంటి అంశాలను బేరీజు వేస్తుంది. దీంతో భద్రతను మరింత మెరుగుపర్చేందుకు అవకాశం ఉంటది. ఇటీవలి కాలంలో ఎయిర్‌పోర్టుల ద్వారా బంగారం, డ్రగ్స్ తరలిస్తూ చాలా మంది పట్టుబడుతున్నారు. ఇలాంటి ఘటనలను దీని ద్వారా నివారించొచ్చని అధికారులు చెప్తున్నారు.
ఈ ఏడాది పెరిగిన ప్రయాణికుల తాకిడి
శంషాబాద్ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి చాలా పెరిగింది. ఈ ఏడాది ఎక్కువ మంది ప్రయాణించిన విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానంలో నిలిచింది. 2023–2024 ఆర్థిక సంవత్సరంలో 2,50,42,282 మంది ప్రయాణించినట్టు సివిల్ ఏవియేషన్ అథారిటీ లెక్కలు చెప్తున్నాయి. అంతకుముందు ఏడాదిలో 2,09,96,027 మంది ప్రయాణించగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 25 శాతం పెరిగింది. ఇక, ఈ జాబితాలో ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది. 7,36,73,708 మంది ప్రయాణికులు ఆ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించారు. ఆ తర్వాత ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్‌నుంచి 5,28,20,754 మంది, బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి 3,75,28,533 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. కాగా, బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రయాణిస్తున్న వీవీఐపీల సంఖ్య ఈ ఏడాది భారీగా పెరిగింది. 8,064 మంది వీవీఐపీలు బేగంపేట నుంచి ప్రయాణం చేయగా.. అంతకు ముందు ఏడాది ఆ సంఖ్య కేవలం 1,938 మందే కావడం గమనార్హం.