రంజీ ట్రోఫీ గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో..హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ 301 ఆలౌట్‌‌‌‌‌‌‌‌.. ఆంధ్ర 168/2

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఆంధ్ర జట్టుతో రంజీ ట్రోఫీ గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్ తొలి రోజు జోరును కొనసాగించలేకపోయింది. ఉప్పల్ స్టేడియంలో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 244/5 రెండో రోజు, గురువారం ఆట కొనసాగించిన హైదరాబాద్ మరో 57 రన్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే చేసి తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 301 స్కోరు వద్ద ఆలౌటైంది. రాహుల్‌‌‌‌‌‌‌‌ రాదేశ్‌‌‌‌‌‌‌‌ (22) ఆట మొదలైన తొలి ఓవర్లోనే ఔటయ్యాడు. ఓ ఎండ్‌‌‌‌‌‌‌‌లో   తన్మయ్ అగర్వాల్ (159)   క్రీజులో నిలిచినా.. సీవీ మిలింద్‌‌‌‌‌‌‌‌ (5), తనయ్‌‌‌‌‌‌‌‌ త్యాగరాజన్ (10), అనికేత్ రెడ్డి (7) పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు క్యూ కట్టారు. తన్మయ్ చివరి వికెట్‌‌‌‌‌‌‌‌గా ఔటయ్యాడు.

ఆంధ్ర బౌలర్లలో త్రిపురాణ విజయ్ ఐదు వికెట్లతో దెబ్బకొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మొదలు పెట్టిన ఆంధ్ర రెండో రోజు చివరకు 168/2 స్కోరు చేసింది.  ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హేమంత్ రెడ్డి (9) ఫెయిలవగా.. అభిషేక్ రెడ్డి (38) ఫర్వాలేదనిపించారు. కెప్టెన్ షేక్ రషీద్ (79 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), కరణ్ షిండే (41 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు అజేయంగా 84 రన్స్ జోడించి రోజు ముగించారు. హైదరాబాద్‌ స్కోరుకు ఆంధ్ర ఇంకా 133 రన్స్ వెనుకంజలో ఉంది.