స్కెచ్ అదిరింది: పెళ్లైన మూడో రోజే.. పెళ్లాం నగలతో భర్త పరార్

కట్టుకున్న భర్తకే కన్నం, పెళ్లి పేరుతో యువతి మోసం, పెళ్లైన గంటకే నగలతో భార్య పరార్.. ఇలాంటి వార్తలు చూసి ఎంత విసిగిపోయారో కదా..! ఇన్నాళ్లకు మగజాతి ఆణిముత్యం దొరికాడు. దోచేయడానికి పెళ్లాడినట్టు.. ఓ యువతిని భర్త వివాహమాడిన మూడు రోజులకే  బోల్తా కొట్టించాడు. భార్య నగలతో ఇంటి నుండి ఉడాయించాడు. ఈ ఘటన తిరువనంతపురంలో జరిగింది. 

నెయ్యట్టింకరకు చెందిన ఫిజియోథెరపిస్ట్ అనంతు(34) కోవిడ్-19 మహమ్మారి కాలంలో ఓ యువతిని పెళ్లాడాడు. ఫిజియోథెరపిస్ట్ కావడంతో కట్న కానుకలు బాగానే అందాయి. మొదటి రెండు రోజులు కార్యక్రమాలు పూర్తయ్యే వరకూ బుద్ధిగా నడుచుకున్న అతను.. మూడోరోజే తన దుర్భుద్ధిని బయటపెట్టాడు. ఎక్కువ కట్నం కావాలంటూ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. అదేరోజు సాయంత్రం సమయంలో పెళ్లికి కానుకగా వచ్చిన నగలను బ్యాంకు లాకర్‌లో భద్రపరుస్తానని చెప్పి ఇంటి నుండి తీసుకెళ్లాడు. అంతే, ఇక మళ్లీ తిరిగి రాలేదు. 

Also Read :- అదుపులో పెట్టుకో.. లేదంటే మేం కంట్రోల్ చేయాల్సి వస్తది

బ్యాంకుకు వెళ్లిన భర్త ఏమైపోయాడోనని నవ వధువు తల్లడిల్లిపోయింది. నగలతో భర్త ఇంటి నుండి వెళ్లిన కుటుంబసభ్యులకు తెలియజేసింది. చివరకు అతను నగలతో ఉడాయించాడని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడేళ్ల నుంచి అతని కోసం గాలిస్తున్నారు. చివరకు అతన్ని బెంగళూరులో అదుపులోకి తీసుకెళ్లారు. ఇంటి నుండి తీసుకెళ్లిన 52 సవర్ల బంగారు నగలు తాకట్టు పెట్టి అతను జల్సాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బును అతను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాడనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.