- వెపన్స్ ఇస్తే.. ఉక్రెయిన్‌లో పరిస్థితి ఇంకా దిగజారుతది
- మానవతా సంక్షోభం తీవ్రమైతదని కామెంట్
కీవ్/మాస్కో: ఉక్రెయిన్‌కు వెపన్స్ అందించడం ఆపేయాలని ఫ్రాన్స్, జర్మనీ దేశాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. మరిన్ని వెపన్స్ అందిస్తే ఉక్రెయిన్‌లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని, మానవతా సంక్షోభం తీవ్రమవుతుందని స్పష్టంచేశారు. ఉక్రెయిన్ సంక్షోభంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రన్, జర్మన్ చాన్స్ లర్ ఓలాఫ్ ష్కోల్జ్ తో పుతిన్ ఫోన్ లో మాట్లాడినట్లు రష్యా అధ్యక్ష భవనం ‘క్రెమ్లిన్’ వెల్లడించింది. ‘‘ఉక్రెయిన్ నుంచి నల్ల సముద్రం ద్వారా ఆహారధాన్యాలను ఎగుమతులు చేసే నౌకలను అనుమతించడంపై చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మాక్రన్, ష్కోల్జ్ లకు పుతిన్ చెప్పారు. పశ్చిమ దేశాలు ఆంక్షలను ఎత్తేయాలని, తర్వాత నల్ల సముద్రంలోని పోర్టుల వద్ద మైన్లను ఉక్రెయిన్ తొలగించాలని డిమాండ్ చేశారు” అని తెలిపింది.
లిమాన్ సిటీ రష్యా వశం
తూర్పు ఉక్రెయిన్ లోని లిమాన్ సిటీని తాము పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని శనివారం రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తూర్పు ఉక్రెయిన్ లో కీలకమైన రైల్వే హబ్ గా ఉన్న లిమాన్ సిటీ మొత్తం రష్యా బలగాలు, రెబెల్స్ అధీనంలోనే ఉందని వెల్లడించింది. లిమాన్ తమ కంట్రోల్ లోనే ఉందని రష్యా మద్దతు ఉన్న రెబెల్స్ శుక్రవారం ప్రకటించగా, ఉక్రెయిన్ ఖండించింది. సిటీలో ఎక్కువ భాగం రష్యా సేనలు ఆక్రమించుకున్నా, మిగతా చోట్ల తమ సేనలు దీటుగా పోరాడుతున్నాయని, స్లోవియాన్స్క్ సిటీకి వెళ్లే మార్గాన్ని పూర్తిగా బ్లాక్ చేశాయని చెప్పింది.
జిర్కాన్ క్షిపణి పరీక్ష సక్సెస్
శుత్రు దేశాల రాడార్ ల నిఘాకు, డిఫెన్స్ వ్యవస్థలకు చిక్కకుండా ధ్వని కంటే వేగంగా దూసుకెళ్తూ టార్గెట్లను పేల్చేసే జిర్కాన్ హైపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ను మరోసారి విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. బారెంట్స్ సీ నుంచి అడ్మిరల్ గోర్ష్ కోవ్ యుద్ధనౌక నుంచి ఈ క్షిపణిని ప్రయోగించగా.. అక్కడికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న వైట్ సీలో ఏర్పాటు చేసిన టార్గెట్ ను కచ్చితత్వంతో ధ్వంసం చేసిందని వెల్లడించింది. కొత్త వెపన్స్ పరీక్షల్లో భాగంగా ఈ ప్రయోగం నిర్వహించినట్లు తెలిపింది. ప్రపంచంలో ఏ దేశమూ అడ్డుకోలేని పవర్ ఫుల్ మిసైల్ జిర్కాన్ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలోనే ప్రకటించారు. జిర్కాన్ క్షిపణి ధ్వని కంటే 5 నుంచి 10 రెట్ల స్పీడ్ తో, తక్కువ ఎత్తులోనే దూసుకెళ్లడం వల్ల రాడార్ లు, డిఫెన్స్ వ్యవస్థలకు చిక్కదని వెల్లడించారు.
