మన చర్మంతో దారం..ఇక ఆపరేషన్ కుట్లకు అదే ఆధారం

మన చర్మంతో దారం..ఇక ఆపరేషన్ కుట్లకు అదే ఆధారం

దెబ్బలు తగిలినప్పుడు, ఆపరేషన్లు చేసినప్పుడు కుట్లేయనింకే ఏ రకం దారం వాడుతరు? దెబ్బతో పాటు మాయమైపోయేలా రెడీ చేసిన నైలాన్‌‌‌‌, పట్టు రకానివి ఉపయోగిస్తరు. కానీ ఏవేవో వాడుడెందుకని మనిషి చర్మ కణాలతోనే ప్రత్యేకమైన దారాన్ని సైంటిస్టులు తయారు చేశారు. ఫైబ్రోబ్లాస్టు కణాలతో తయారు చేసిన ఈ దారాలను రకరకాలుగా వాడుకోవచ్చని తెలిపారు. కుట్టడానికి, ముడులేయడానికి, అల్లడానికి వీలుగా డిజైన్‌‌‌‌ చేశామన్నారు. ట్యూబ్‌‌‌‌లు, వాల్వ్‌‌‌‌లు, రంధ్రాలుండే బట్ట లాంటి ఆకారాలనూ రెడీ చేసుకోవచ్చన్నారు. ఫ్రెంచ్‌‌‌‌ సైంటిస్టులు చేసిన ఈ రీసెర్చ్‌‌‌‌ను అక్టా బయోమెటీరియాలియా జర్నల్‌‌‌‌లో పబ్లిష్ చేశారు. ముందు షీట్లుగా చర్మాన్ని తయారు చేస్తారని, తర్వాత రిబ్బన్లుగా కత్తిరిస్తారని, రకరకాల రూపాల్లోకి మారుస్తారని సైంటిస్టులు తెలిపారు. దెబ్బలకు సింథటిక్‌‌‌‌ స్కిన్‌‌‌‌ వాడితే మంట పెరుగుతుందని, గాయం మానడం కూడా ఆలస్యమవుతుందని గుర్తు చేశారు. అదే ఫైబ్రోబ్లాస్టులతో చేసే దారాలను మనిషి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ కూడా వ్యతిరేకించదని, కాబట్టి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కు బాగా పనికొస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.

ముందు జంతువులపై..

ఈ సరికొత్త ప్రయోగాన్ని డైరెక్టుగా మనుషుల మీదనే చేయట్లేదని సైంటిస్టులు చెప్పారు. ఇప్పటికే కొన్ని రకాల జంతువులపై పరీక్షించి చూశామన్నారు. ఓ గొర్రెకు సంబంధించిన చర్మ కణాలతో ట్యూబ్‌‌‌‌ను తయారు చేసి గొర్రెలోని ఓ ధమనిలోని సెట్‌‌‌‌ చేశామని, రక్తం ఫ్రీగా వెళ్లిందని చెప్పారు. ఎలాంటి లీకేజీ జరగలేదన్నారు. ఎలుకలపై కూడా ఈ ప్రయోగం చేశామని చెప్పారు. ఓ ఎలుక చర్మ కణాలతో దారం తయారు చేసి దాన్ని ఎలుక గాయాన్ని మాన్పించడానికి వాడామని, 14 రోజుల్లో నయమైపోయిందని వివరించారు. త్వరలో మనుషులకూ వాడేలా చర్మ దారాన్ని తయారు చేస్తామన్నారు.