సైన్స్ ఆధారంగానే జీవన విధానం : గుత్తా సుఖేందర్ రెడ్డి  

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  

నల్గొండ అర్బన్, వెలుగు : సైన్స్ ఆధారంగానే మనిషి జీవన విధానం ఉంటుందని, ఆధునిక వ్యవసాయరంగంలో సైన్స్ ది కీలకపాత్ర అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలోని ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న డాన్ బోస్కో ఉన్నత పాఠశాలలో రెండు రోజులపాటు నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్, గణిత, పర్యావరణ ప్రదర్శన శనివారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో సైన్స్ కు డిమాండ్​పెరుగుతుందన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరిగిందని తెలిపారు. గతంలో వ్యవసాయం చేయడం కష్టంగా ఉండేదని, శాస్త్రవేత్తలు వివిధ రకాల యంత్ర పరికరాలు, పనిముట్లు కనుక్కోవడం వల్ల ప్రస్తుతం వ్యవసాయం సులభమైందన్నారు.

భవిష్యత్ శాస్త్రవేత్తలను తయారు చేయడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. విద్యార్థుల సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీసి వారిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈసారి బడ్జెట్​లో రూ.21 వేల కోట్లను కేటాయించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల ఇరవై వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని తెలిపారు. 26 వేల పాఠశాలలు ఉన్నాయని, 6 వేల పాఠశాలలు మూతపడే పరిస్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గురుకులాల్లో ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, డ్రాప్ అవుట్లను తగ్గించి విద్యార్థుల సంఖ్యను పెంచడంపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈవో గోనారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, డాన్ బోస్కో స్కూల్ ప్రిన్సిపాల్ బాలశౌరి రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.