ఉప్పాడ సముద్రం.. ఊర్లల్లోకి వచ్చింది

కాకినాడ సమీపంలోని ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. శనివారం ( మే25)  సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గం యూ. కొత్తపల్లి మండలం ఉప్పాడలో  మూడో రోజు ( మే 27) సముద్రం ఉగ్రరూపం దాల్చింది. దీని తాకిడికి మాయా పట్నంలో ఇళ్లలోకి సముద్రపునీరు వచ్చి చేరింది.  ఇక సముద్రంలో ఒక్కసారిగా నీటి మట్టం పెరగడం, అలాగే సముద్రం ముందుకు రావడంతో మత్స్యకారులు బిక్కు బిక్కుమంటూ  తీవ్ర భయాందోళన చెందుతున్నారు.   ఈ అలల ఉదృతికి బీచ్ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే రహదారిపై వాహనదారులను సైతం ఈ అలలు ముంచెత్తున్నాయి.

 సముద్ర నీటి మట్టం పెరిగి సముద్రం ముందుకు వచ్చింది. దీనితో మత్స్యకారులు తీవ్ర భయాందోళనకు గురవతున్నారు. ఇది ఇలా ఉండగా మూలిగే నక్కపై తాటిపండు పడిందన్నట్టు నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్పపీడనం వాయుగుండంగా మారి తుపాన్‌గా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది.

అలానే ప్రస్తుతం ఈ తుపాను ఈశాన్య దిశగా కదిలి..  ఇది పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్‌కు 380 కిలో మీటర్లు దూరంలోనూ అలానే బంగ్లాదేశ్‌కు నైరుతి దిశగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం కావడంతో.. ఈ ప్రభావం కారణంగానే ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది.