మోకాళ్ల నొప్పి మందు కోసం జాతర.. జనంతో కొత్తకోట ఆగం

వనపర్తి: మోకాళ్ల నొప్పులు తగ్గడానికి మందులు ఇస్తున్నారన్న  వీడియో వాట్సప్, ఇన్ స్టాలో వైరల్ కావడంతో కొత్తకోటకు జనం పోటెత్తారు.  ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల బాధితులు కార్లు, ఇతర వాహనాల్లో  తరలివచ్చారు.  బస్టాండ్ ముందు వాహనాలు కిలోమీటర్ల పొడవునా బారులు తీరాయి. పట్టణంలో పేరుపొందిన నాటు వైద్యుడు రాములు మోకాళ్ల నొప్పులు తగ్గడానికి ఆయుర్వేద ఔషధాలు ఇస్తున్నారు.

ఈ క్రమంలో ఇతని దగ్గర నొప్పులు తగ్గడానికి హైదరాబాదుకు చెందిన ఒక వ్యక్తి ఆయుర్వేద మందులు తీసుకున్నాడు. తనకు15  రోజుల్లోనే మోకాళ్ల నొప్పులు తగ్గాయని, ఎప్పటిలా  తాను సునాయాసంగా నడవగలుగుతున్నానని చెప్పి ఓ వీడియో తీశాడు. దీనిని రెండు రోజుల క్రితం వాట్సాప్, ఇన్ స్టాలో పోస్ట్​ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. 

ఈ వీడియోను చూసిన పేషెంట్లు మందు కోసం హైదరాబాద్, కర్నూలు, అనంతపూర్ తదితర దూర ప్రాంతాల నుంచి వెహికల్స్ లో ఇవాళ కొత్తకోటకు వచ్చారు. రోడ్లపై వెహికల్స్ తాకిడి చూసిన పోలీసులు సదరు నాటు వైద్యుడిని సంప్రదించారు.  వీడియోలో మాట్లాడిన వ్యక్తి నంబరు ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే వీడియో ఉన్న వ్యక్తి ఎవరో తనకు తెలియదని, ఇంత మందిని తాను రమ్మని చెప్పలేదని నాటు వైద్యుడు రాములు తెలిపాడు.

విషయం తెలుసుకున్న డీఎంహెచ్​వో తనిఖీకి వెళ్లడంతో ఆ నాటు వైద్యడు మందుల పంపిణీని ఆపేశాడు. దీంతో జనం అక్కడి నుంచి  వెళ్లిపోయారు.  మోకాళ్ల నొప్పులు తగ్గడానికి ఆయుర్వేద ఔషధాలు ఇస్తున్నట్లు తెలుసుకున్నారు.  అంతేకాక ఎటువంటి డాక్టర్​పట్టా లేకుండానే వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు.