కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో భక్తులు ఎక్కువగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. భక్తులు ఉదయమే స్వామివారికి తలనీలాలు సమర్పించి దర్శనం కోసం మండపంలో బారులుతీరారు. గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించారు.

మరికొంతమంది స్వామివారికి అభిషేకాలు చేసి నిత్య కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది. అనంతరం మల్లన్న గుట్టపై ఉన్న రేణుక ఎల్లమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ మురళీ బాబు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో బాలాజీ, ఏఈవో శ్రీనివాస్, ఆలయ సిబ్బంది, అర్చకులు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు.