- 1564 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
- నిఫ్టీ 440 పాయింట్లు జూమ్
వెలుగు, బిజినెస్ డెస్క్: మన స్టాక్ మార్కెట్లు మంగళవారం దుమ్ము రేపాయి. అమెరికాతోపాటు ఇతర గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో సెన్సెక్స్ ఏకంగా 1564 పాయింట్లు, నిఫ్టీ 440 పాయింట్లు దూసుకెళ్లాయి. దీంతో ఇన్వెస్టర్లకు పంట పండింది. వారి సంపద ఒకే రోజు రూ. 5.65 లక్షల కోట్లు ఎగసింది. ఫెడ్ ఛైర్మన్ సిగ్నల్‌తో శుక్రవారం మన మార్కెట్లు కూడా భారీగా పతనమైన విషయం తెలిసిందే. మంగళవారం సెషన్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు వెలుగులో నిలిచాయి. ఈ ఏడాదిలో స్టాక్‌మార్కెట్లు ఇంతలా పెరగడం ఇదే రెండోసారి. రూపాయి బలపడటం కూడా మార్కెట్‌కు కలిసి వచ్చింది.నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 3.42 శాతం, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 3.29 శాతం పెరగడంతోపాటు, నిఫ్టీ ఐటీ, ఆటో ఇండెక్స్, మిడ్‌క్యాప్ 50, స్మాల్ క్యాప్ 50 ఇండెక్స్లూ ఎగిశాయి.
బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్....
సెన్సెక్స్ షేర్లలో బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ గెయినర్‌గా నిలవగా, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకుల షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. ఏషియన్ మార్కెట్లలో సౌత్ కొరియా కోస్పి, జపాన్ నికీ పెరగ్గా, చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ మాత్రం పడింది. మంగళవారం ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు దొరికింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ లు ఇండెక్స్ 250 పాయింట్లు పెరగడానికి కారణమయ్యాయి.
యూఎస్ ఫ్యూచర్ల మద్దతు....
వరసగా రెండు సెషన్లు నష్టపోయిన యూఎస్ మార్కెట్లు పుంజుకోవడం మన మార్కెట్‌కు సపోర్ట్‌గా నిలిచింది. ఎస్ అండ్ పీ ఫ్యూచర్స్ మార్కెట్ కొద్దిపాటి లాభాలతోనే ట్రేడయినా, యూఎస్ మార్కెట్లు బలంగా నిలబడతాయనే సంకేతాలివ్వడంతో మన మార్కెట్లు దూసుకెళ్లాయని ఎనలిస్టులు చెబుతున్నారు.
చమురు రేట్లు తగ్గాయ్....
చమురు రేట్లు అంతకు ముందు సెషన్‌తో పోలిస్తే మంగళవారం కొద్దిగా తగ్గాయి. మార్కెట్లు భారీగా పెరగడానికి ఇది కూడా ఊతమిచ్చింది. గ్లోబల్‌గా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపుదల వైపు చూస్తున్న నేపథ్యం ఎకనమిక్ స్లో డౌన్‌కు దారి తీస్తుందని, ఫలితంగా చమురు డిమాండ్ తగ్గొచ్చని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ (అక్టోబర్ సెటిల్మెంట్) 56 సెంట్లు తగ్గి 104.53 డాలర్లకు చేరింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ నవంబర్ కాంట్రాక్టు 102.57 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
రూపాయి సపోర్ట్...
మరోవైపు డాలర్ ఇండెక్స్108.70 పాయింట్ల వద్ద నిలిచింది. ఇంతకు ముందు సెషన్‌తో పోలిస్తే ఈ ఇండెక్స్ కూడా తగ్గింది. యూరో బలపడటమే దీనికి కారణం. ఇది స్టాక్ మార్కెట్లకు బాగా కలిసొచ్చే అంశం. డాలర్‌తో పోలిస్తే మన కరెన్సీ రూపాయి మంగళవారం ట్రేడింగ్‌లో బలపడింది. ముందు రోజు 79.81 గా ఉన్న రూపాయి మారకపు విలువ ఈ సెషన్లో 79.96 వద్ద ముగిసింది. ఈ నెలలో ఫారిన్ ఇన్వెస్టర్లు మన షేర్లలో 6 బిలియన్ డాలర్లను కుమ్మరించారు. డిసెంబర్ 2020 నుంచి చూస్తే ఒకే నెలలో ఇంత ఎక్కువ విదేశీ పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారని ఎనలిస్టులు తెలిపారు.
