కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి

కొమురవెల్లి, వెలుగు: కార్తీక మాసం పురస్కరించుకుని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తుల తాకిడి పెరిగింది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. భక్తులు ముందుగా కల్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించి, కోనేరులో స్నానం చేసి, గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి, స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం మల్లన్న గుట్టపై ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయానికి వెళ్లి బోనాలు సమర్పించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. కాగా స్వామివారిని డాక్టర్ రవీందర్ ఐపీఎస్​దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. కుమారుడి వివాహ పత్రికను తీసుకొని రాగా అర్చకులు స్వామివారి పాదాల చెంత పెట్టి ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.