మరో 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని హెచ్‌ఎస్‌బీసీ ఆలోచిస్తోంది. కొన్ని వారాల కిందటే హెచ్‌ఎస్‌బీసీ 4 వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ బ్యాంకింగ్ దిగ్గజం సీఈఓ కూడా ఇటీవలే రాజీనామా చేశారు. ఎక్కువ వేతనాలు పొందే వారి మీదే ఈసారి వేటు పడనుందని తెలుస్తోంది. వ్యయాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఇంటరిమ్ బాస్ నోయెల్ క్విన్ ఈ వేటు నిర్ణయం తీసుకున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టు చేసింది. పడిపోతున్న వడ్డీ రేట్లకు అడ్జస్టవడం కష్టంగా మారడం, బ్రెగ్జిట్, ట్రేడ్‌వార్ అంశాల నేపథ్యంలో ఉద్యోగుల తగ్గింపు నిర్ణయానికి హెచ్‌ఎస్‌బీసీ వచ్చిందని చెబుతున్నారు. కొన్ని క్లిష్టమైన పరిస్థితులున్నాయి. కొన్ని ఆసియా దేశాలలో రెండంకెల ప్రతిఫలాలు వస్తుంటే, యూరప్‌లో ఇంత ఎక్కువ మంది ఉద్యోగులు ఎందుకున్నారనేది లోతుగా చూస్తున్నామని పేరు బయటపెట్టడానికి ఇష్టపడని కంపెనీ వర్గాలు వెల్లడించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. చేరిన ఏడాదిన్నర కాలంలోపే సీఈఓ జాన్ ఫ్లింట్ కిందటి నెలలో రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు కారణాలనూ వెల్లడించలేదు. గ్లోబల్ ఉద్యోగుల సంఖ్యలో 2 శాతం ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఈ ఏడాది తొలి ఆరు నెలలకూ కంపెనీ లాభం 18.6 శాతం పెరిగి 850 కోట్ల డాలర్లకు చేరింది. అక్టోబర్ చివరి నాటికి మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను హెచ్‌ఎస్‌బీసీ వెల్లడించాల్సి ఉంది. జాన్ ఫ్లింట్ ప్లేస్‌లో స్టువర్ట్ గలివర్ జాయినయ్యారు. ఆయన చేరిన తర్వాతే భారీ ప్రక్షాళన మొదలైంది. ఈ ప్రక్షాళన కింద 50 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపడంతోపాటు, కొన్ని ముఖ్యమైన మార్కెట్ల నుంచి వైదొలగాలని గలివర్ నిర్ణయించారు. కఠినమైన పరిస్థితులను తట్టుకునే దిశలో గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజాలన్నీ ఈ విధమైన చర్యలనే తీసుకుంటున్నాయి. యూఎస్ బ్యాంకులైన జేపీ మోర్గాన్ ఛేస్, వెల్స్ ఫార్గోలు 2019 కి తమ లాభాలు తక్కువగానే ఉండబోతున్నాయని ఇప్పటికే సూచించాయి. వడ్డీ రేట్ల తగ్గుదల వల్ల లాభాలు తగ్గనున్నట్లు ఆ బ్యాంకులు చెబుతున్నాయి. కిందటి నెలలోనే జర్మనీ బ్యాంకింగ్ దిగ్గజం కామర్జ్ బ్యాంక్ కూడా 4500 మంది ఉద్యోగులపై వేటు వేసింది. 200 బ్రాంచ్‌లనూ ఆ బ్యాంకు మూసి వేసింది. ఇక డాయిష్ బ్యాంకు 18 వేలు, సొసైటీ జనరల్ 1600 మంది ఉద్యోగలను తొలగించింది.

