రూపాయి బంగారం కూడా కొనొచ్చు

రూపాయి బంగారం కూడా కొనొచ్చు
  • డబ్బు ఉన్నప్పుడే ఇన్వెస్ట్​ చేయొచ్చు

న్యూఢిల్లీ: ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ.50 వేలకు అటుఇటుగా ఉంది. చాలా మంది ఇంత ధర పెట్టి కొనలేరు. కొనాలనుకున్నా చిన్న మొత్తంలోనే కొనాలి. ఇలాంటి రిటైల్​ ఇన్వెస్టర్లకు డిజిటల్​ గోల్డ్​ బెస్ట్​. ఇందులో మైక్రో–ఇన్వెస్ట్​మెంట్​ పద్ధతిని ఎంచుకుంటే తక్కువ మొత్తం పెట్టి కూడా బంగారాన్ని కొనొచ్చు.సాధారణ బంగారంలో పాక్షికంగా పెట్టుబడి పెట్టడం చాలా కాలంగా ఉంది. భారతీయులు జ్యువెలర్ల నుండి చాలా తక్కువ పరిమాణంలో బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.మైక్రో–ఇన్వెస్ట్​మెంట్ దానిని తదుపరి స్థాయికి తీసుకెళ్లింది. బంగారంలో రూపాయి కంటే తక్కువ కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

అసిట్ సి. మెహతా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ ఆనంద్ వరదరాజన్ మాట్లాడుతూ “డిజిటల్​ గోల్డ్​/మైక్రోఇన్వెస్ట్​ విధానంలో వన్​టైమ్​ లేదా పీరియాడిక్​ ఇన్వెస్ట్​మెంట్​లలో ఏదో ఒక దానిని ఎంచుకొని ఆ రోజు ధరకే బంగారాన్ని కొనొచ్చు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే పసిడి కొనుక్కోవచ్చు. అనేక డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌లు బంగారంలో మైక్రో–ఇన్వెస్ట్​మెంట్​ను అనుమతిస్తాయి” అని ఆయన వివరించారు. సాధారణ బంగారంలా కూడా మార్చుకోవచ్చు అసెట్​ సి  ద్వారా గోల్డ్​ కొనాలనుకునే వాళ్లు చోటా నివేష్ గోల్డ్  యాప్​ను వాడాలి. కొనుగోలు చేయాలనుకుంటున్న బంగారం ఎంతో పేర్కొనాలి. నగదు మొత్తం లేదా బంగారం పరిమాణం ఎంతో చెప్పాలి ఇలా కొనుగోలు చేసిన బంగారాన్నియాప్‌‌లోని వారి ఖాతాలో పోగుచేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత నాణెం లేదా బార్ రూపంలో డెలివరీ తీసుకోవచ్చు.ఇదే యాప్ ద్వారా ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చు. పెట్టుబడిని లిక్విడేట్ కూడా చేసుకోవచ్చు. కొందరు పెట్టుబడిదారుడికి అమ్మకం రోజున ఉన్న ధర ప్రకారం బంగారం విలువను లెక్కగడతారు.

మరికొందరు ఖాతాలో ఉన్న బంగారాన్ని పెట్టుబడిదారుడికి భౌతికంగా అందజేస్తారు. సాధారణ బంగారం ఇన్వెస్టర్లు అనేక లావాదేవీలు చేసినప్పుడు ఎక్కువ లావాదేవీల ఖర్చును చెల్లించాలి. డిజిటల్​ గోల్డ్ విషయంలో​ ఇది తప్పనిసరి కాదు.  మీరు సాధారణ బంగారాన్ని కొనుగోలు చేస్తే, దాని భద్రత,  బీమా, లాకర్ అద్దెల కోసం డబ్బును ఖర్చు చేయాలి. డిజిటల్ బంగారంలో ఇలా కాదు.  బ్రోకరేజ్‌‌లు లేదా కమీషన్‌‌లు, మేకింగ్ లేదా డిజైన్ ఛార్జీలు బాధ ఉండదు. మార్క్–అప్‌‌లు లేదా ఖరీదైన లాకర్లు లేదా బీమా ప్లాన్‌‌లను కొనాల్సిన అవసరం లేదు. డిజిటల్ బంగారం వద్దనుకుంటే బాండ్లవైపు చూడవచ్చు. మీకు దీర్ఘకాలిక పెట్టుబడి ఆలోచన ఉంటే, సావరిన్ గోల్డ్ బాండ్‌‌లను (ఎస్​జీబీలు) కూడా కొనుక్కోవచ్చు. దీనిపై ఏటా 2.5 శాతం వడ్డీ వస్తుంది. మైక్రోఇన్వెస్ట్​మెంట్​ ద్వారా సగటున 9.6 శాతం వరకు వార్షిక రాబడి ఉంటుందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. అయితే డిజిటల్​ గోల్డ్ ​ గోల్డ్​ రెగ్యులేటరీ మెకానిజం పరిధిలో లేదు. ప్రొడక్టును దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి  కాబట్టి కొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.