భారతీయ నౌకాదళంలోకి ఐఎన్​ఎస్ తుషిల్​ యుద్ధనౌక

భారతీయ నౌకాదళంలోకి ఐఎన్​ఎస్​ తుషిల్​ చేరింది. రష్యాలోని కాలినిన్​గ్రాడ్​లో ఆ నౌకను జలప్రవేశం చేయించారు. క్రివాక్​–3 క్లాస్​ ఫ్రిగేట్​కు చెందిన అప్​గ్రేడ్​ వెర్షన్​ 1135.6 ప్రాజెక్టులో భాగంగా ఐఎన్​ఎస్​ తుషిల్​ యుద్ధనౌకను తయారు చేస్తున్నారు. ఇప్పటికే సర్వీసులో ఉన్న ఆరు యుద్ధ నౌకల్లో మూడు తల్వార్​ క్లాస్​, మరో మూడు టెగ్​ క్లాస్​గా విభజించారు. 

తల్వార్​ క్లాస్​ నౌకలను సెయింట్​ పీటర్స్​బర్గ్​లోని బాల్టిస్కీ షిప్​యార్డ్​లో తయారు చేయగా, మిగిలిన మూడు నౌకలను కాలినిన్​గ్రాడ్​లోని యాంటర్​ షిప్​యార్డ్​లో రూపొందించారు. ఇదే సిరీస్​లో ఏడో యుద్ధనౌక ఐఎన్​ఎస్ తుషిల్. ఈ నౌక తయారీకి 2016లో రోసోబోరన్​ ఎక్స్​పోర్ట్, భారత నౌకాదళం, భారత ప్రభుత్వం మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ నౌక పొడవు 125 మీటర్లు, బరువు 3900 టన్నులు. రష్యా, భారతదేశ టెక్నాలజీని ఉపయోగించి ఈ యుద్ధనౌకను రూపొందించారు. ఇందులో 33 శాతం మేడ్​ ఇన్​ ఇండియాలో భాగంగా తయారు చేసిన పరికరాలనే వినియోగించారు. 

Also Read : యునిసెఫ్​ వ్యవస్థాపక దినోత్సవం.. ప్రత్యేక కధనం

ఈ నౌకలో ఉపయోగించిన పరికరాలను బ్రహ్మోస్​ ఏరోస్పేస్​ ప్రైవేట్​ లిమిటెడ్​, భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​, కేల్ట్రన్​, నోవా ఇంటిగ్రేటెడ్​ సిస్టమ్స్, టాటా, ఎల్​కోమ్​ మెరైన్​, జాన్సన్​ కంట్రోల్​ ఇండియా తదితర సంస్థలు తయారుచేశాయి. 

తుషిల్​ అంటే రక్షణ కవచం అని అర్థం. ఈ యుద్ధనౌకపై అభేద్య కవచ్​ అనే నినాదం రాశారు. దీంతోపాటు నిర్భయ్​, అభేద్య ఔర్​ బల్​ శీల్​ (భయం లేనిది, అజేయమైంది, నిశ్చలమైంది) లక్షణాలతో ఈ తుషిల్​ యుద్ధనౌక, దేశ తీరప్రాంత పరిరక్షణలో నౌకా వాణిజ్య పరిరక్షణలో తన వంతు పాత్ర పోషించనున్నది.