ఏపీ పలితాలు వైరల్: 28 లక్షల ఓట్లకు 21 సీట్లు.. కోటి ముప్పై లక్షల ఓట్లకు 11 సీట్లు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. మొత్తం 175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏకంగా 164(135+ 21+ 8) స్థానాలను కైవసం చేసుకోగా.. వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ ఫలితాలు అంగీకరించదగినవే అయినప్పటికీ.. పోలైన ఓట్ల శాతానికి, వచ్చిన సీట్లకు పొంతన లేదనే చర్చ నెట్టింట మొదలైంది.

28 లక్షల ఓట్లకు 21 సీట్లు..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. పోటీ చేసిన అన్నిచోట్లా విజయం సాధించింది. గతేడాది కేవలం ఒక్కటే స్థానానికి పరిమితమైన ఆ పార్టీ.. ఈసారి ఏకంగా పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించింది. ఇది బాగానే ఉన్నా.. ఆ పార్టీకి పోలైన ఓట్లకు.. వచ్చిన సీట్లకు పొంతన లేదని వైసీపీ శ్రేణులు వాపోతున్నారు. 

2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి పోలైన ఓట్లు.. 28లక్షల 79వేల 555. అనగా 8. 53 శాతం. ఈ ఓట్లతోనే జనసేన పార్టీ 21 చోట్ల విజయం సాధించింది. అదే వైఎస్‌ఆర్‌సీపీ విషయానికొస్తే.. వారికి కోటి 32 లక్షల 84వేల ఓట్లు పోలయ్యాయి. కానీ, వారు విజయం సాధించింది మాత్రం.. పదకొండు చోట్లే. ఈ ఇరు పార్టీల మధ్య దాదాపు కోటికి పైగా ఓట్ల తేడా ఉంది. అయినప్పటికీ.. జనసేన 10 స్థానాల్లో ఎక్కువ విజయం సాధించడం ఎలా సాధ్యమైందన్న చర్చ జరుగుతోంది. పోల్‌మేనేజ్ మెంట్‌ను టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎంత చక్కగా చేసింది అనటానికి ఇదే నిదర్శనం అంటున్నారు వైసీపీ కార్యకర్తలు.

వైసీపీ నేతల విమర్శలకు టీడీపీ శ్రేణులు,జనసైనికులు అదే రీతిలో బదులిస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేక జగన్ బ్యాచ్ కొత్త వాదన మొదలు పెట్టిందని విమర్శిస్తున్నారు. ఎన్ని కోట్ల ఓట్లు పడ్డాయి అనేది కాదు.. ఎన్ని సీట్లు గెలిచాం అన్నది ముఖ్యం అంటూ టీడీపీ కూటమి నేతలు సినిమా డైలాగ్స్ పేలుస్తున్నారు.