తెలంగాణ వింత : ఆ కాలనీ పేరు అల్లుళ్ల కాలనీ.. ఎలా పెట్టారు అలా..!

అల్లుళ్ల కాలనీ

కొన్ని కాలనీల పేర్లు గమ్మత్తుగా ఉంటుంటాయి.అట్లాంటిదే ఈ పేరు కూడా. 'అల్లుళ్ల కాలనీ'. మామూలుగా అయితే ప్రముఖ వ్యక్తుల పేర్లతో కాలనీలకు పేర్లు పెడతారు. అందుకు పూర్తి భిన్నంగా ఉంది కదా ఈ పేరు. ఇంతకీ ఈ అల్లుళ్ల కాలనీ ఎక్కడుందనుకున్నారు. అశ్వారావుపేట పట్టణంలో. అది సరే.. అసలీ పేరు ఎందుకు పెట్టారు.. ?

 అశ్వారావుపేట టౌన్, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పేరాయిగూడెం పంచాయతీ పరిధిలోని ఒక కాలనీని 'అల్లుళ్ల కాలనీ' అని పిలుస్తారు. ఇక్కడ మొత్తం 110 కుటుంబాలు ఉన్నాయి. 2002లో అప్పటి ఆర్అండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఇల్లు లేని నిరుపేదల కోసం స్థలాలు కేటాయించి, పట్టాలు మంజూరు చేశారు.

పేరాయిగూడెంలో నివసిస్తున్న ఆడపిల్లలకు వివాహాలు జరగటంతో తల్లిదండ్రులు కట్నం కింద ఈ స్థలాలు రాసిచ్చారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అల్లుళ్లు ఇక్కడ స్థిరపడ్డారు. అలా 'అల్లుళ్లకాలనీ'గా పేరొచ్చింది. ఇక్కడ నివసించే వాళ్లలో 70 కుటుంబాలు అల్లుళ్లకు చెందినవి కావడం విశేషం. అయితే, రానురాను ఈ పేరును మోడల్ కాలనీ'గా మార్చారు. అయినా, 'అల్లుళ్లకాలనీ' అనే పిలుస్తారు ఈ ప్రాంత ప్రజలు. ఒక ఇంటి అల్లుడి రాకతో మొదలైన కాలనీ.. ప్రస్తుతం 70 మంది అల్లుళ్లతో కళకళలాడుతోంది' అని చెప్పారు కాలనీ వాసులు.