గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను కడ్తలేరు

  • వసూలు చేయాల్సింది రూ.17.23 కోట్లు
  • వసూలైంది రూ.4 కోట్లే
  • ఆత్మకూరులో అతి తక్కువ వసూలు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను సరిగా కడ్తలేరు. వసూళ్లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. పన్ను వసూలుకు వెళ్లిన వారిని రేపు, మాపు అంటూ తిప్పించడమే కానీ చెల్లించడం లేదు. ఇందులో వాణిజ్య సంస్థలు కూడా పన్ను చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. వసూళ్లు స్పీడ్​గా చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. 

2.02 లక్షల ఇండ్లు..

జిల్లాలో 17 మండలాల్లో 421 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల కొత్తగా ఐదు పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పంచాయతీల్లో పన్ను చెల్లించే ఇండ్ల 2,02,381 ఉన్నాయి. వీటిలో అపార్ట్​ మెంట్లు, ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కళాశాలలు కూడా ఉన్నాయి. అత్యధికంగా రామన్నపేట మండలంలో పన్ను చెల్లించే ఇండ్లు 18,875 ఉండగా, మోత్కూరు మండలంలో అతితక్కువగా 4,550 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. 

టార్గెట్​రూ.17.23 కోట్లు..వసూలైంది రూ.4 కోట్లే..

2024-–25 ఫైనాన్షియల్ ఇయర్​లో రూ.17,23,05,449 ఇంటి పన్ను వసూలు చేయాల్సి వచ్చింది. అయితే గ్రామ పంచాయతీ సిబ్బంది​పన్ను వసూలుకు వెళ్లిన సమయంలో రేపు, మాపు అంటూ తిప్పించుకోవడం అలవాటుగా మారింది. ఒకటికి రెండుమార్లు వెళ్లినా చెల్లించని ఇండ్లవైపు మళ్లీ స్టాఫ్​ వెళ్లడం లేదు. అయితే కొన్ని వ్యాపార సంస్థలు కూడా పన్ను చెల్లించకుండా తిప్పించుకుంటున్నాయని పంచాయతీ సెక్రటరీలు చెబుతున్నారు.

పన్ను వసూలు కోసం పంచాయతీ స్టాఫ్ ఎంత ప్రయత్నించినా నిర్దేశించిన లక్ష్యంలో కేవలం రూ.4 కోట్లు (24 శాతం) మాత్రమే వసూలు చేయగలిగారు. ఇందులోనే ఏదైనా సర్టిఫికెట్స్​ లేదా అత్యవసర స్థితుల్లోనే కొందరు పన్ను చెల్లించడం వల్ల ఈ స్థాయిలో వసూలు చేయగలిగారు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఇంకా రూ.13.23 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.

చౌటుప్పల్​లో ఎక్కువ, ఆత్మకూరు(ఎం)లో తక్కువ..

చౌటుప్పల్​ మండలంలో ఇంటి పన్ను ఎక్కువగా వసూలు చేశారు. మండలంలో 26 గ్రామ పంచాయతీలు ఉండగా, 14,813 ఇండ్ల నుంచి రూ.2.99 కోట్లు వసూలు కావాల్సి ఉండగా 1.11 కోట్లు (37 శాతం) వసూలు చేశారు. 30 శాతం కంటే ఎక్కువగా మూడు మండలాల్లో వసూలు చేశారు. ఆరు మండలాల్లో 20 శాతం కంటే ఎక్కువగా వసూలు చేశారు. ఆత్మకూరు (ఎం) మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉండగా, రూ.44.12  లక్షల పన్ను చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు రూ.3.69 లక్షలు (8 శాతం) మాత్రమే వసూలు చేశారు. 

స్పెషల్​ డ్రైవ్ నిర్వహిస్తాం

పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు చాలా తక్కువగా జరిగింది. గ్రామ పంచాయతీల్లోని వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా పన్ను చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటివరకు 24 శాతం మాత్రమే వసూలు జరిగింది. వంద శాతం పన్ను వసూలు చేయడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం.

- సునంద, డీపీవో, యాదాద్రి