షార్ట్‌‌ సర్క్యూట్‌‌తో  ఇల్లు దగ్ధం..మహిళ  సజీవ దహనం

  • మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా మిడ్జిల్‌‌లో ఘటన

మిడ్జిల్, వెలుగు : షార్ట్‌‌ సర్క్యూట్‌‌ కారణంగా ఎగిసిపడ్డ మంటలు అంటుకొని ఓ మహిళ సజీవ దహనమైంది. ఈ ఘటన మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా మిడ్జిల్‌‌లో బుధవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మిడ్జిల్‌‌ మండల కేంద్రానికి చెందిన తుపుడ యాదమ్మ (55) కూతురు నాగమ్మతో కలిసి రేకుల ఇంట్లో ఉంటోంది.

నాగమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో రెండు రోజులుగా పక్కనే ఉన్న తమ్ముడు తిరుపతయ్య ఇంట్లో ఉండగా, యాదమ్మ ఒక్కతే తన ఇంట్లో పడుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక రేకుల ఇంట్లో షార్ట్‌‌ సర్క్యూట్‌‌ జరిగి మంటలు లేచి, దుప్పట్లకు అంటుకున్నాయి. మోకాలి నొప్పులతో బాధపడుతున్న యాదమ్మ ఇంట్లో నుంచి బయటకు రాలేక మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైంది.

బుధవారం తెల్లవారుజామున మూడు గంటలకు యాదమ్మ ఇంట్లో నుంచి పొగలు రావడం చూసిన చుట్టుపక్కల వారు కొడుకు తిరుపతయ్యకు సమాచారం ఇచ్చారు. అతడు ఇంటికి వెళ్లి మంటలను ఆర్పి చూసేసరికే యాదమ్మ చనిపోయింది. తిరుపతయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.