కేజీబీవీ స్టూడెంట్లకు అందని వేడి​నీళ్లు .. నిరుపయోగంగా మారిన సోలార్​ ప్లాంట్లు

వనపర్తి, వెలుగు: చలికాలం మొదలవుతుందంటే కేజీబీవీ స్టూడెంట్లలో ఆందోళన ప్రారంభమైంది. పొద్దున్నే స్నానం చేయడానికి గరం​నీళ్లు దొరకకపోవడంతో, చన్నీళ్లతో కానియ్యాల్సిన పరిస్థితి నెలకొంది. కేజీబీవీ స్టూడెంట్లకు వేడి నీటిని అందించేందుకు సోలార్​ ప్లాంట్లను అమర్చారు. అయితే ప్రస్తుతం ఈ ప్లాంట్లు నిరుపయోగంగా మారాయి. ఎక్కడా సోలార్​ ప్లాంట్లు పనిచేయడంలేదు. దీంతో చన్నీళ్లతో స్నానం చేసేందుకు స్టూడెంట్లు తిప్పలు పడుతున్నారు. 

నాలుగేళ్లుగా అందట్లే..

వనపర్తి జిల్లాలో 15  కేజీబీవీలు ఉండగా, నాలుగేండ్ల కింద 10 స్కూళ్లలో సోలార్​ హీటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో సోలార్​ హీటర్​ ప్లాంట్​కు రూ.2 కోట్లు ఖర్చు కాగా, మొత్తం రూ.20 కోట్లు వెచ్చించారు.  ఈ కేజీబీవీల్లో 2,600 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. వీరంతా ప్రస్తుతం ఉదయం పూట వేడి నీటికి దూరమవుతున్నారు.

విద్యుత్  సమస్యే కారణమా?

కేజీబీవీల్లో సోలార్​ హీటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఎండ పూర్తిగా తగలనప్పుడు అవి పని చేసేందుకు కరెంట్​ మీటర్లు ఏర్పాటు చేశారు.  కానీ, త్రీ ఫేస్​ కరెంట్​ లేకపోవడంతో హీటర్లు పని చేయడం లేదు. ఎండ లేనప్పుడు సోలార్​ హీటర్లు కరెంట్​తో పని చేసేలా చూడడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి ఉందని అంటున్నారు. ప్రస్తుతం కేజీబీవీల్లో వాటర్​  హీటర్​ కోసం ఎంసీపీ స్విచ్​ వేస్తే మీటరు వద్ద మంటలు ఎగిసి పడుతుండడంతో భయపడుతున్నారు.

 ఎండ లేనప్పుడు కరెంట్​తో పని చేసేందుకు ప్రతి కేజీబీవీలో ఒక త్రీ ఫేస్​ ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కేజీబీవీల్లో సోలార్​ హీటర్లు పని చేసేలా చూడాలని విద్యార్థినుల పేరెంట్స్​ కోరుతున్నారు.