ఆయిల్​పామ్​ టార్గెట్  2 వేల ఎకరాలు

2024-25లో తోటల పెంపకానికి యాక్షన్ ప్లాన్ రెడీ 
1,176 ఎకరాల్లో సాగుకు పేర్లు నమోదు చేసుకున్న రైతులు
 దిగుబడి సేకరించేందుకు 20 కిలో మీటర్లకు ఒక సెంటర్

మెదక్, వెలుగు: జిల్లాలో 2024– 25లో 2 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు పెంచాలని హార్టికల్చర్ డిపార్ట్​మెంట్​యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. వీటి సాగుపై కలెక్టర్ రాహుల్ రాజ్ సైతం  ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. నాణ్యమైన మొక్కలు సరఫరా చేయడం, డ్రిప్ ఏర్పాటు కోసం పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇవ్వడం, పంట దిగుబడి కొనుగోలు చేసేందుకు జిల్లాలోనే కంపెనీ ఏర్పాటు చేయడంతో రైతులు ఆయిల్ పామ్ తోటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా 2 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగుకు ప్రణాళికలు రూపొందించగా ఇప్పటి వరకు 1,176 ఎకరాల్లో రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ సీజన్​లో ఇప్పటి వరకు 25 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టారు. మెదక్ పట్టణ పరిధిలోని నర్సిఖేడ్​ ఏరియాలో మెగా ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. ఇటీవల కలెక్టర్ ఇక్కడ మొక్కలు నాటారు. 

లివింగ్ ఫుడ్ కంపెనీకి అనుమతి 

జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన మొక్కలు సరఫరా చేసేందుకు, పంటను కొనుగోలు చేసి నూనె ఉత్పత్తి చేసేందుకు లివింగ్ ఫుడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సదరు కంపెనీ ఆయిల్ పామ్ మొక్కలు ఉత్పత్తి చేసేందుకు నిజాంపేట్ మండలం చల్మెడ గ్రామంలో 43 ఎకరాల స్థలంలో నర్సరీని స్థాపించింది. ఇక్కడ నాణ్యమైన మొక్కలు ఉత్పత్తి చేసి రైతులకు అందజేస్తారు.

జిల్లాలో 2023 -–24లో  74 మంది రైతులు 336 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. ప్రభుత్వం ద్వారా 336 ఎకరాలకు సంబంధించి రూ.13 లక్షల సబ్సిడీ రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. ఒక రైతుకు గరిష్టంగా 12.50 ఎకరాల వరకు డ్రిప్ పరికరాలపై 90 శాతం రాయితీ సదుపాయం ఉంది. ఒక ఎకరానికి మొదటి ఏడాది రూ.9,650 సబ్సిడీ ఇవ్వడంతో పాటు, అంతర్ పంటల సాగు కోసం మొదటి, రెండు, మూడు, నాలుగేళ్లకు రూ.26,450 సబ్సిడీ అందుతుంది.

ఆదాయం ఇలా..

ఆయిల్ పామ్ మొక్కలు నాటిన నాలుగో ఏట నుంచి దిగుబడి మొదలవుతుంది. ఎకరాకు 10 నుంచి 12 టన్నులు దిగుబడి సాధించవచ్చని హార్టికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక టన్ను ఆయిల్ పామ్ గెల రూ. 14,500 ఉంది.  ఈ లెక్కన సంవత్సరానికి రూ.1.74 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అన్ని ఖర్చులు పోను ఏడాదికి  ఒక ఎకరానికి రూ .1.20 లక్షల ఆదాయం సమకూరుతుంది.

జిల్లాలోని రైతులు ఆయిల్ పామ్ ఉత్పత్తులను ఫ్యాక్టరీకి తరలించేందుకు  రవాణా ఛార్జీలు అధికమవుతాయని కంపెనీ ప్రతి 20 కిలోమీటర్లకు ఒక సేకరణ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే గెలలను కొనుగోలు చేసిన తర్వాత నిబంధనల  ప్రకారం 14 రోజుల్లోపు రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది.