Hong Kong Sixes 2024: 6 బంతుల్లో 6 సిక్సర్లు.. ఊతప్ప తాటతీసిన బొపారా

హాంకాంగ్ సిక్స్‌స్ టోర్నీలో టీమిండియా హ్యాట్రిక్ ఓటములు మూటగట్టుకుంది. తొలిరోజు దాయాది పాకిస్థాన్, పసికూన యూఏఈ చేతిలో భంగపోయిన భారత జట్టు.. రెండో రోజూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఇంగ్లండ్ చేతిలో 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత మాజీ బ్యాటర్ రాబిన్ ఊతప్ప ఒకే ఓవర్‌లో 37 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో 6 సిక్సర్లు ఉండటం గమనార్హం. 

6 బంతుల్లో 6 సిక్సర్లు

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో ఊతప్ప ఈ చెత్త ఘనత సాధించాడు. పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్‌గా అవతారమెత్తిన ఈ మాజీ భారత బ్యాటర్‌ కొట్టుకోండి అన్నట్లుగా బంతులేశాడు. ఇదే మంచి అవకాశం అనుకున్న ఇంగ్లీష్ మాజీ క్రికెటర్ రవి బొపారా.. ఏకంగా ఆ ఓవర్‌లో 6 బంతులను స్టాండ్స్‌లోకి పంపాడు. అంతటితో అతని విధ్వంసం ఆగలేదు. షాబాజ్ నదీమ్‌ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో తాను ఎదుర్కొన్న  తొలి బంతిని సిక్సర్‌గా మలిచాడు. దాంతో,  కేవలం 14 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం టోర్నీ నియమనిబంధనల ప్రకారం 53 (14) పరుగులు చేసి రిటైరయ్యాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోయి 120 పరుగులు చేసింది. ఛేదనలో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 105 పరుగులకే పరిమితమైంది. ఇప్పటికే ఆడిన మూడింట ఓటమిపాలైన భారత్‌.. టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.