- ఇంకా 8–9 శాతం పెరగొచ్చు
న్యూఢిల్లీ: ఇండ్ల నిర్మాణ ఖర్చు గత ఏడాది కాలంలో 10 నుంచి 12 శాతం పెరిగిందని ప్రాపర్టీ కన్సల్టెంట్ కాలియర్స్ ఇండియా ఒక రిపోర్టులో తెలిపింది. సిమెంటు, స్టీలు, ఇతర ఖర్చులు పెరగడం వల్లే నిర్మాణ వ్యయం అధికమైందని పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్లోగా ఈ నిర్మాణ ఖర్చు మరో 8–9 శాతం పెరిగే ఛాన్స్ ఉందని కూడా వెల్లడించింది. సప్లయ్ సమస్యల వల్ల ముడి సరుకుల ఖర్చు అధికమైందని వివరించింది. సిమెంట్, స్టీలు వంటి మెటీరియల్స్ఈ నెల మొదటికే 20 శాతం పైగా పెరిగాయని కాలియర్స్ ఇండియా రిపోర్టు తెలిపింది. కొవిడ్–19 క్రైసిస్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నేపథ్యంలో డెవలపర్లు రేట్లు పెంచడానికి వెనుకంజ వేస్తున్నట్లు పేర్కొంది. ఖర్చు బాగా పెరగడంతో ఇప్పుడిప్పుడే వాటిని రివ్యూ చేయడం మొదలు పెట్టినట్లు తెలిపింది. మొత్తం కన్స్ట్రక్షన్ ఖర్చులో మెటీరియల్స్ ఖర్చు మూడింట రెండొంతులు ఉండటంతో ఇండ్ల రేట్లను పెంచడం డెవలపర్లకు తప్పకపోవచ్చని అభిప్రాయపడింది. గత కొన్నేళ్లుగా పెద్దగా మార్జిన్లు లేకుండానే డెవలపర్లు మనుగడ సాగిస్తున్నారని కాలియర్స్ రిపోర్టు వివరించింది. అందుబాటు ధరలు, మిడ్ సెగ్మెంట్లలో ఇండ్లు కట్టే డెవలపర్లపైనే ఎక్కువ ఎఫెక్ట్పడుతుందని, ఎందుకంటే వీరే తక్కువ మార్జిన్లతో వ్యాపారం చేస్తున్నారని కాలియర్స్ ఇండియా సీఈఓ రమేష్నాయర్ చెప్పారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, మెటీరియల్ ఖర్చులు రెండూ రెండంకెల పెరుగుదల రికార్డు చేశాయని పేర్కొన్నారు. ఏడాది కిందట చదరపు అడుగుకు రూ. 2,060 గా ఉన్న సగటు నిర్మాణ ఖర్చు ఈ ఏడాది మార్చి నాటికి రూ. 2,300 కి చేరినట్లు వెల్లడించారు. ఇందులో జీఎస్టీని కలపలేదని పేర్కొన్నారు.
