పంజాగుట్టలో హిట్​ అండ్‌ రన్‌

  • బీటెక్ విద్యార్థులను ఢీకొట్టి, ఆగకుండా వెళ్లిన ట్రావెల్స్ బస్సు
  • ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్టలో హిట్​అండ్‌ రన్‌ కేసు నమోదైంది. బైక్​ను​ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విద్యానగర్​కు చెందిన రాజయ్య కొడుకు పున్నం లోకేశ్​(21) బాచుపల్లిలోని వీఎన్ఆర్​విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనలియర్​చదువుతున్నాడు. తన ఫ్రెండ్ ధర్మతేజ్​తో కలిసి శుక్రవారం ఉదయం బైక్​పై కాలేజీకి బయలుదేరారు. 

మార్గమధ్యలో అమీర్​పేట​వద్ద వారిని వెనుక నుంచి ప్రైవేట్ బస్సు ఢీకొట్టి, ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో లోకేశ్​ స్పాట్​లోనే మృతి చెందగా, వెనుక కూర్చున్న ధర్మతేజ్​కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన గో టూర్ ట్రావెట్స్ బస్సును బాచుపల్లిలో స్వాధీనం చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.