జనసేన సూపర్ హిట్ .. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం

  • పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపు
  • 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో గెలిచిన జనసేన
  • ప్రచారంలో అన్ని తానై నడిపిన పవన్
  • అండగా నిలిచిన యూత్, కాపు సామాజిక వర్గం

హైదరాబాద్, వెలుగు: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సూపర్ హిట్ అయింది. ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గెలిచారు. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్​సభ స్థానాల్లో జనసేన పోటీ చేయగా మొత్తం సీట్లలో విజయం సాధించింది. పిఠాపురం నుంచి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్.. వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతపై 70,729 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పార్టీ ఏర్పాటు చేసిన పదేండ్ల తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పీకే గెలుపు అంతా ఈజీ కాదని అందరూ అన్నప్పటికి.. ప్రభుత్వంపై వ్యతిరేకత, కాపు ఓట్లు, యూత్, మహిళల ఓట్లు వంటి అంశాలు పవన్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా.. మచిలీపట్నం లోక్​సభ సెగ్మెంట్ నుంచి బాలశౌరి 2.20 లక్షలు, కాకినాడ నియోజకవర్గం నుంచి ఉదయ్ శ్రీరామ్ 2.29లక్షల మెజారిటీతో గెలుపొందారు. 21 సీట్లు రావటంతో రెండు లేదా మూడు కేబినెట్ పదవులు, విప్, కార్పొరేషన్ పదవులు, ఎమ్మెల్సీలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఎన్నికల ప్రచారంలో జోష్ 

పవన్ కళ్యాణ్ ప్రచారం కూటమికి బాగా కలిసొచ్చింది. ప్రతి సభలో వైసీపీని విమర్శిస్తూ.. జగన్ తప్పులను ఎత్తిచూపుతూ మాట్లాడి ఓటర్లలో ఉత్సాహం నింపారు. ముఖ్యంగా కోస్తా ఆంధ్రాలోని బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపు ఓట్లు గంపగుత్తగా జనసేన, టీడీపీ, బీజేపీకే పడ్డట్లు తెలుస్తున్నది. దీంతో పాటు యూత్, రైతులు, అన్ని కులాల ఓట్లు కూటమికి పడటంలో పవన్ కీలక పాత్ర పోషించారు. 

ఎన్నో విమర్శలు తట్టుకొని విజయం

జనసేన పార్టీ పెట్టి పదేండ్లు అయినా ఎమ్మెల్యేగా గెలవలేదని.. నిలకడ లేదని.. హైదరాబాద్ లో ఉంటూ వీకెండ్ లో ఏపీ రాజకీయాలు చేస్తారని..  చంద్రబాబు ఏజెంట్ అని.. సొంత నిర్ణయాలు తీసుకోలేడని.. అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. వాటన్నింటినీ తిప్పికొడుతూ ఏపీ రాజకీయాల్లో రియల్ హీరోగా పవన్ నిలిచారు. పిఠాపురంలో పవన్​ను ఓడించేందుకు వైసీపీ ఎన్నో కుట్రలు పన్నింది. వాటన్నింటిని తట్టుకుని గెలుపే లక్ష్యంగా ముందుకు కదిలారు. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడంలో పవన్ కీలకపాత్ర పోషించారు. పొత్తులో భాగంగా టికెట్లు రావడం లేదని పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మతో పాటు పదేండ్ల నుంచి పార్టీలో ఉన్న నేతలకు సర్దిచెప్పడంలో పవన్ సక్సెస్ అయ్యారు.

వంద శాతం సక్సెస్ 

రాజకీయాల్లో అన్న చిరంజీవి కంటే పవన్ కల్యాణ్ ఎక్కువ సక్సెస్ అయ్యారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నరు. 2009లో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టి 288 సీట్లలో పోటీ చేసి కేవలం 18 స్థానాల్లో విజయం సాధించారు. తర్వాత పార్టీ నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. కానీ.. పవన్ కల్యాణ్ మాత్రం.. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచి 100 శాతం సక్సెస్ కావటం గ్రేట్ అంటూ విశ్లేషకులు అంటున్నారు.

చీకటి రోజులు పోయాయి: పవన్ కళ్యాణ్

పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. దేశంలో ఏ పార్టీ కూడా పోటీ చేసిన ప్రతి చోటా 100 శాతం విజయాన్ని ఇప్పటిదాకా అందుకోలేదని తెలిపారు. ఫలితాల తర్వాత మంగళగిరిలోని పార్టీ ఆఫీస్​లో ఆయన మాట్లాడారు. ‘విజయాన్ని బాధ్యతగా భావిస్తాను. ప్రజల ఆకాంక్షల కోసం పని చేస్త. వైసీపీపై కక్ష సాధింపు చర్యలు ఉండవు. రాష్ట్రంలో చీకటి రోజులు పోయాయి.చాలా జాగ్రత్తగా ప్రజలకు జవాబుదారీగా పాలన అందించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. తర్వాత టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పవన్ భేటీ అయి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు.