కొత్త పార్టీ ప్రకటనపై రజనీ మీద ఒత్తిడి తీసుకురాబోం

కొత్త పార్టీ ప్రకటనపై రజనీ మీద ఒత్తిడి తీసుకురాబోం
బెంగళూరు: రాజకీయ పార్టీ పెట్టాలన్న నిర్ణయాన్ని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉపసంహరించుకున్నారు. డిసెంబర్ 31న కొత్త పార్టీని ప్రకటిస్తానని చెప్పిన తలైవా.. ఆరోగ్య కారణాల రీత్యా పాలిటిక్స్‌కు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఆయన అభిమానులు షాక్‌‌కు గురయ్యారు. ఈ విషయంపై రజనీ సోదరుడు సత్యనారాయణ రావు స్పందించారు. పొలిటికల్ ఎంట్రీపై రజనీ తీసుకున్న నిర్ణయం మార్పునకు తాను ఒత్తిడి తీసుకురాబోనని, అది ఆయన ఇష్టమని స్పష్టం చేశారు. రజనీ రాజకీయాల్లోకి రావాలని చాలా మంది అభిమానులు, ప్రజల్లాగే తామూ కోరుకున్నామని సత్యనారాయణ తెలిపారు. ‘రజనీకి ఆరోగ్య కారణాలు ఉన్నాయి. పార్టీ పెట్టొద్దన్నది ఆయన సొంత నిర్ణయం. రజనీ తీసుకున్న నిర్ణయం కచ్చితంగా సరైనది. ఆయన మీద మేం ఎలాంటి ఒత్తిడి తీసుకురాబోం’ అని సత్యనారాయణ పేర్కొన్నారు. బీపీ సమస్యతో హైదరాబాద్‌‌లోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రజనీ.. ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్య సమస్యలతో రాజకీయ పార్టీ పెట్టాలనుకున్న ఆలోచనను విరమించుకుంటున్నానని రజనీ పేర్కొన్నారు. రజనీ మక్కల్ మండ్రమ్‌‌ మెంబర్లతోపాటు ఫ్యాన్స్‌‌ను క్షమించాలని కోరారు.