హిందువులు సంఘటితం కావాలి: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

వికారాబాద్, వెలుగు: హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ విగ్రహాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం మేకవనంపల్లిలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. 

దేశంలో హిందూ సమాజం సంఘటితంగా కావలసిన అవసరం ఎంతైనా ఉందని, శివాజీ వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకుపోవాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. మొగల్ రాజులతో ఎంతో ధైర్యంగా, వీరోచితంగా పోరాడి హిందూమతాన్ని కాపాడిన ఘనత శివాజీ మహారాజ్ కే దక్కుతుందన్నారు. మహారాష్ట్రలో ఆయన పట్టాభిషేకాలను పండుగలా నిర్వహించుకుంటారన్నారు. ప్రతి ఏడాది అయోధ్య, కాశితోపాటు మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ నిర్మించిన కోటలను సందర్శిస్తానన్నారు. 

ఇకముందు తనతో పాటు కొందరు యువకులను కూడా తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. శివాజీ తన రాజ్యంలో లౌకికవాదాన్ని కూడా పాటించారన్నారు. హిందూ మతం మారిన వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి పెండ్లి చేసిన చరిత్ర కూడా శివాజీకి ఉందని పేర్కొన్నారు.  తన రాజ్యంలో అన్ని మతాలను సమానంగా ఆదరించి సత్కరించారన్నా రు. వికారాబాద్ కో ఆర్డినేటర్ వడ్ల నందు, కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, మండల బీజేపీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీజేవైఎం మండల పార్టీ అధ్యక్షుడు ఆశి రెడ్డి, బీజేవైఎం జిల్లా కన్వీనర్ రఘునాథ్ రెడ్డి, అన్నదాత వేమారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.