రోడ్డు ప్రమాదంలో హిందూపురం సిల్క్ రీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడి మృతి

రోడ్డు ప్రమాదంలో హిందూపురం సిల్క్ రీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడి మృతి

మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

తమ సమస్యలపై సీఎంను కలిసేందుకు వెళ్తుండగా గుంటూరు వద్ద ప్రమాదం

అనంతపురం: హిందూపురం సిల్క్ రీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ గుంటూరు వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తమ అసోసియేషన్ ప్రతినిధులతో కలసి బయలుదేరి వెళ్తున్న వీరి వాహనం మరికొద్దిసేపట్లో అమరావతికి చేరుకుంటుందనగా ప్రమాదానికి గురైంది.  సిల్క్ రీలర్స్ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కలిసేందుకు హిందూపురం, ధర్మవరం, కదిరి నుండి వాహనంలో అమరావతి వస్తుండగా.. గుంటూరు సమీపంలోహైవేపై నిలబడి ఉన్న సేఫ్టీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హిందూపురం సిల్క్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రియాజ్ అహ్మద్ తీవ్ర గాయాలతో తుదిశ్వాస విడిచారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు సమీపంలోనే ఈ రోడ్డు ప్రమాదం జరగడంతో క్షతగాత్రులను వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

క్షతగాత్రులను  పరామర్శించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్

 

ఈ విషయం తెలిసిన వెంటనే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ హుటాహుటిన గుంటూరు ఆస్పత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా డాక్టర్లను ఆదేశించారు. హిందూపురం సిల్క్ రీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రియాజ్ అహ్మద్ మృతి పట్ల ఎంపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. రెండు రోజుల క్రితం హిందూపురంలో వీరి నిరసన శిబిరాన్ని సందర్శించి, సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చానని ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  కేంద్రంతో చర్చించి సిల్క్ రీలర్స్ సమస్య వెంటనే పరిష్కారం అయ్యేలా రాష్ట్ర వైస్సార్ ఎంపీల అందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.