ఆధ్యాత్మికం: గుళ్లో ప్రదక్షిణం ఎందుకు చేయాలి.. తీర్థయాత్రల వల్ల ఉపయోగం ఏమిటి,,రావి చెట్టూ తిరిగితే పిల్లలు పుడతారా..?

ఆచారాలు, సంప్రదాయాలు ఒకతరం నుంచి మరో తరానికి వస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు పుట్టాయో, ఎందుకు పుట్టాయో. ఎవరు పుట్టించారో కూడా కచ్చితంగా చెప్పలేరు. కానీ పెద్దల మాట చద్దిమూట అని ఆచరిస్తూ ఉంటారు. ఆ ఆచారాల వెనక ఈ తరానికి తెలియని ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. తెలియకుండా పాటించడం కంటే వాటిలోని మంచి గురించి కూడా తెలుసుకోవాలి. అందుకే... కొన్ని ఆచారాల వల్ల జరిగే మేలు గురించి తెలుసుకుందాం...

ప్రదక్షిణ

దేవాలయానికి వెళ్లగానే ప్రదక్షిణ చేస్తారు. గర్భ గుడి చుట్టూ తిరుగుతారు. మరికొందరు ఎవరికి వాళ్లే గుండ్రంగా ప్రదక్షిణం చేస్తారు. ఈ రెండు రకాలైన ప్రదక్షిణల వల్ల లాభాలున్నాయి. మనిషి సత్వ, రజో, తమో గుణాల కలయిక. ఈ మూడు గుణాలకు అతీతంగా ఉన్నప్పుడే దైవానికి దగ్గర కాగలడు. ప్రదక్షిణ వల్ల ఇది సాధ్యమవుతుందని పురాణాలు చెప్తాయి. కానీ మనిషి తనకు తాను గుండ్రంగా తిరగడం వల్ల నిటారుగా నిలబడే శక్తి పొందుతాడు. అలాగే దేవాలయంలోని శక్తికి కేంద్రమైన గర్భగుడి చుట్టూ తిరగడం వల్ల మనిషి ఆ శక్తిని కొంతవరకు గ్రహించగ లుగుతాడని అంటారు. 

ALSO READ | Kids Special : చిన్న పిల్లల్ని ఇలా నవ్వించండి.. యాక్టివ్ గా ఉంటారు.. పువ్వల్లే.. నవ్వుల్ నవ్వుల్..!
మనం నివసించే భూమి భక్తుడికి ప్రతీక. భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అంటే భ్రమణం, పరిభ్రమణం వల్ల తన శక్తితో పాటు, సూర్యుని నుంచి కూడా శక్తిని గ్రహిస్తుంది. ఇదో వైజ్ఞానిక సూత్రం, ప్రదక్షిణ వల్ల మనిషి కూడా ఇలాంటి శక్తిని పొందే అవకాశం ఉన్నదని మరికొందరు చెప్తారు. అలాగే ప్రదక్షిణ ఎప్పుడూ సవ్య దిశలోనే ఉంటుంది. కుడి దిశలో తిరగడం వల్ల మనిషికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది.

సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం

పెద్దలు రోజూ అయిదు గంటలకే నిద్రలేవాలని చెప్తారు. తెల్లవారు జామున వీచే గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ గాలిలో అమృతరసం ఉంటుందని అంటారు. దీనినే హీరవాయువు కూడా అని పిలుస్తారు. దీని వల్ల బుద్ధి వికసిస్తుంది. ఆయుష్షు పెరుగుతుంది. అందుకే పిల్లలను వేకువజామున లేచి చదువుకోమని చెప్తారు. ఆ వేళలో చదివితే మనసుకు ఎక్కుతుంది. ..మర్చి పోరు.

తీర్థయాత్రలు

తీర్ధయాత్రలు చేయడం వల్ల పిల్లలు పుడతారని చెప్తుంటారు. పురాణాలు, కథల్లోనూ ఈ విషయం కనిపిస్తుంది. తీర్థయాత్రలు చేయడం వల్ల వాతావరణం మారుతుంది. దాంతో శరీరంలో మార్పులు వస్తాయి..
నదుల్లో నీళ్లు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. వాటిల్లో స్నానం చేయడం వల్ల అనా రోగ్య సమస్యలు తగ్గి, గర్భధారణకు అవకాశం కలగొచ్చు.

పిల్లలకు చెవులు కుట్టించడం

చిన్నవయసులోనే అమ్మాయిలకు చెవులు కుట్టిస్తారు. ఒకప్పుడు అబ్బాయిలకు కూడా చెవులు కుట్టించి రింగులు పెట్టే ఆచారం ఉండేది. చెవులు కుట్టించడం ఆక్యుప్రెషర్ వైద్యం లాంటిదే. దీనివల్ల కొన్ని రకాల అనారోగ్యాలు దరిచేరవు. ముఖ్యంగా ఆస్తమా లాంటి వాటి నుంచి ఇదికాపాడుతుందని చెప్తారు.

నేలపై కూర్చొని భోజనం చేయడం

ఇప్పుడైతే చాలామంది డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలపై కూర్చొని తింటున్నారు. ఒకప్పుడు పీటమీద కూర్చొని తినేవాళ్లు లేదా నేల మీద కూర్చొని భోజనం చేసేవాళ్లు. అలాంటప్పుడు శరీరం పద్మాసనం భంగిమలో ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. జీర్ణకోశ సంబంధ సమస్యలు చాలా వరకు రావు..

బొట్టుపెట్టుకోవడం

స్త్రీలు బొట్టు పెట్టుకోవడం హిందూ సంప్రదాయంలో కనిపిస్తుంది. కొందరు మగవాళ్లు కూడా నుదుట బొట్టు పెట్టుకుంటారు. దీనిలో ఆరోగ్య రహస్యం ఉంది. నరాలు సరిగా పనిచేస్తాయి. అందువల్ల ఒత్తిడి, బీపీ, ఆందోళన వంటివి తగ్గుతాయి.

ఉపవాసం

అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం మంచిదేనని వైద్యులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే, ఉపవాసం రోజున శరీరంలోని జీర్ణవ్యవస్థ పని చేయాల్సిన అవసరం ఉండదు. అదనంగా ఉన్న కొవ్వు తగ్గుతుంది. చెడు పదార్థాలు బయటకు వెళ్తాయి. దాంతో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు రావు..

నదులు, కోనేరుల్లో నాణేలు వేయడం

నదుల్లో, కోనేరులో స్నానం చేసేముందు నాణేలు వేస్తారు. ఒకప్పుడు నాణేలు రాగితో తయారు చేసేవాళ్లు. రాగికి నీటిని శుద్ధిచేసే శక్తి ఉంది. వాటిలో ఎక్కువమంది స్నానాలు చేస్తారు కాబట్టి నీళ్లు పరిశుభ్రంగా ఉండటానికి ఇవి వేయడమే మంచిది.

రావి చెట్టును పూజించడం

పిల్లలు పుట్టని వాళ్లకు రావిచెట్టును పూజించమని, దాని చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్తారు. దీని వెనక కూడా ఆరోగ్య సూత్రం ఉంది. రావి ఆకులకు ఆక్సిజన్  ఎక్కువగా ప్రసారం చేసే శక్తి ఉంటుంది. వాటిలో ఉన్న విద్యుత్ అయ స్కాంత శక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల స్త్రీల శరీరంలో మార్పులు జరిగి సంతానోత్పత్తికి అవకాశం కలగొచ్చు..

ఉత్తరం దిక్కుకు తలపెట్టి పడుకోకూడదు

నిద్రపోయేటప్పుడు ఉత్తరం దిక్కుకు తలపెట్టొద్దని పెద్దలు చెప్తారు. ఎందుకంటే, శరీరానికి కూడా అయస్కాంత శక్తి ఉంటుంది. ఉత్తర దిక్కుకు తల పెడితే శరీరంలోని ఐరన్ మెదడుకు చేరే అవకాశాలు ఎక్కువ. దాంతో గుండె సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు తలనొప్పి, అల్జీమర్స్ లాంటివి కూడా రావచ్చు. కాబట్టే ఉత్తరం దిక్కుకు తలపెట్టి నిద్ర పోవవద్దని పెద్దలు చెప్తారు.

-వెలుగు, లైఫ్-