బాధిత కుటుంబానికి అస్సాం ముఖ్యమంత్రి క్షమాపణలు

బాధిత కుటుంబానికి అస్సాం ముఖ్యమంత్రి క్షమాపణలు

గౌహతి : మాఫియా బెదిరింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాధిత కుటుంబానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ క్షమాపణలు చెప్పారు. బాధిత కుటుంబానికి 'సారీ' అని క్షమాపణ చెబుతూ...తానెప్పుడూ ఇంతలా సిగ్గుపడలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. పోలీస్‌ యంత్రాంగం ఉన్నప్పటికీ మాఫియా గ్యాంగ్‌ బెదిరింపులకు పాల్పడే సాహసం చేసిందంటే...నిజంగా ఇది చాలా సిగ్గుచేటు అని అన్నారు. 

దిబ్రూఘర్‌లో 32 ఏళ్ల వినిత్‌ బగారియా అనే యువ వ్యాపారవేత్త మాఫియా బెదిరింపులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుటుంబానికి చెందిన ఓ షాపులోని వ్యక్తితో సహా ముగ్గురు తననను బెదిరిస్తున్నారని, ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని కూడా వినిత్‌ బగారియా సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు బాధితుడు తెలిపిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ప్రజలతో పోలీసులు స్నేహ పూర్వకంగా మెలగాలని పదేపదే చెబుతున్నప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించి వారి గోడుని పట్టించుకోని పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హామీ ఇచ్చారు.