లాక్ డౌన్ ఎఫెక్ట్: 200 కిలోమీటర్ల దూరం నుంచి కనిపిస్తున్న హిమాలయాలు

లాక్ డౌన్ ఎఫెక్ట్: 200 కిలోమీటర్ల దూరం నుంచి కనిపిస్తున్న హిమాలయాలు
  • స్వచ్ఛమైన గాలి.. వాతావరణమే కారణం
  • యూపీలోని సహరాన్ పూర్ నుంచి కనిపిస్తున్న హిమాలయాలు
  • సహరాన్ పూర్ నుంచి ఎరియల్ డిస్టెన్స్ 200 కిలోమీటర్లే
  • గత ఏడాది మాదిరే ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి
  • పెద్ద టెలిస్కోప్ నుంచి చూసిన అనుభూతిని కలిగిస్తున్నాయంటున్న స్థానికులు

న్యూఢిల్లీ: లాక్ డౌన్ ప్రభావంతో ప్రకృతి మళ్లీ పూర్వ స్థితికి చేరుకుంటోందా.. పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. దాదాపు నెల రోజులుగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తుండడంతో వాహనాల రద్దీ.. కాలుష్యం తగ్గిపోయింది. ప్రశాంత వాతావరణంతో స్వచ్చమైన గాలి.. ప్రకృతి కొత్తగా కనిపిస్తోందని అన్ని ప్రాంతాల ప్రజలు అనుభవ పూర్వకంగా చెబుతున్నారు. ఎప్పుడో దశాబ్దాల క్రితం మన పూర్వీకుల నాటి దృశ్యాలు సాక్షాత్కరిస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రకృతి సిద్ధమైన హిమాలయ అందాలు వందల కిలోమీటర్ల దూరం నుండి చూసే భాగ్యం కరోనా లాక్ డౌన్ కల్పించిందని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సహరాన్ పూర్ వాసులు సంభ్రమాశ్చర్యాలతో చెబుతున్నారు. సహరాన్ పూర్ నుంచి హిమాలయాలు ఏరియల్ డిస్టెన్స్ (ఆకాశంలో) 200 కిలోమీటర్లు ఉంటుంది. ఇంత దూరం నుండి హిమాలయాలు చూశామని తమ తాతల కాలంలో చూశామంటే నమ్మని వారు.. ఇప్పుడు స్వయంగా చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. 
గత ఏడాదికూడా కరోనా లాక్ డౌన్ సమయంలో ఇలాగే కనిపించిన విషయం తెలిసిందే.  కలల్లో.. సినిమా గ్రాఫిక్స్ లలో తప్ప మళ్లీ చూడలేమనుకుంటున్న అరుదైన దృశ్యాలు కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాయి. అవే అనుభవాలు తిరిగి ఈసారి కూడా కనిపిస్తున్నాయి. అల్లంత దూరంలో ఉన్న హిమాలయాలను చూస్తున్న సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్న ఉత్తర్ ప్రదేశ్ సహరాన్ పూర్ వాసులు లాక్ డౌన్ వల్ల కాలుష్యం తగ్గి స్వచ్ఛమైన గాలి.. మంచి వాతావరణం ఏర్పడడమే కారణం అంటున్నారు. గత ఏడాది మాదిరే ఇప్పుడు కూడా హిమాల‌య ప్రాంతంలోని గంగోత్రి, య‌మునోత్రి అలాగే బండార్‌పూంచ్ ప‌ర్వ‌త శ్రేణి పూర్తిగా క‌నిపిస్తోంది. పెద్ద టెలిస్కోప్‌ నుంచి చూస్తే తప్ప కనిపించని దృశ్యాలు చూస్తున్న స‌హ‌ర‌న్‌పూర్ వాసులు ఈ సుంద‌ర దృశ్యాల‌ను ఫోటోలు, వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గత ఏడాదిలానే ఇప్పుడ‌వి వైర‌ల్‌గా మారాయి. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఇక్క‌డి నుంచి హిమాల‌య పర్వతాలు మ‌ళ్లీ ఇప్పుడు అలాంటి ప‌రిస్థితిని చూస్తున్నామని వృద్ధులు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మరో వైపు లాక్‌డౌన్ కార‌ణంగా గ‌త ఏడాది గంగాన‌ది కాలుష్యం చాలా తగ్గిపోయి స్వ‌చ్ఛంగా మారిపోవడం చూశాము. వేల కోట్లు ఖర్చు చేసినా చేయలేని పనినిని కరోనా 2 నెలల్లో గంగా నదిని పూర్వ స్థితికి తెచ్చిందన్న కామెంట్లు తెలిసిందే. దురదృష్టశాత్తు ఈసారి గంగానదిలో నిత్యం వంద‌లాది శవాలు క‌నిపిస్తూ ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.