చిన్న మొత్తాల పొదుపుపై ఎక్కువ వడ్డీ

చిన్న మొత్తాల పొదుపుపై ఎక్కువ వడ్డీ

న్యూఢిల్లీ: సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ స్కీమ్‌‌, పబ్లిక్ ప్రావిడెంట్‌‌ ఫండ్ వంటి చిన్న మొత్తాల పథకాల్లో పొదుపు చేస్తున్న వారికి గుడ్​న్యూస్​! ఇట్లాంటి ఇన్వెస్ట్​మెంట్లపై 2023 జనవరి–మార్చి క్వార్టర్​కు వడ్డీరేట్లను పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పథకాన్ని బట్టి వడ్డీని 20 నుంచి 110 బేసిస్ పాయింట్లు  (0.20%–1.10%) పెంచారు. అంటే ఇక నుంచి నాలుగు శాతం నుంచి 7.6 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. చిన్న మొత్తాల పథకాలపై వడ్డీరేట్లు ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చే మార్కెట్​ రాబడులను బట్టి ఉంటాయి. వీటిని 0–100 బేసిస్​ పాయింట్లలో లెక్కిస్తారు. అన్నిసార్లూ మార్కెట్​ రాబడులను బట్టి రేట్లను నిర్ణయించకపోవచ్చు. కేంద్రం చివరగా ఈ ఏడాది అక్టోబరు–-డిసెంబరు క్వార్టర్​లో వడ్డీరేట్లను 10–30 బేసిస్​ పాయింట్లను పెంచింది.

అంతకుముందు వరుసగా తొమ్మిది క్వార్టర్లలో చిన్న మొత్తాల పథకాలపై వడ్డీరేట్లను మార్చలేదు. గవర్నమెంటు సెక్యూరిటీలపై రాబడులు తగ్గినప్పటికీ వడ్డీరేట్లను మాత్రం పెంచింది. ఈ ఏడాది రిజర్వ్​ బ్యాంకు వడ్డీరేట్లను ఏప్రిల్​ నుంచి 225 బేసిస్ పాయింట్లు పెంచింది. ధరల పెరుగుదలను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకులు కూడా లెండింగ్, డిపాజిట్​ రేట్లను పెంచాయి. గవర్నమెంటు బాండ్ల రాబడులు బాగా పెరుగుతున్నాయని ఆర్​బీఐ ఇటీవల విడుదల చేసిన మానిటరీ పాలసీ రిపోర్టులో పేర్కొంది. ఐదేళ్ల గవర్నమెంట్‌‌ బాండ్లపై రాబడి 15 బేసిస్​ పాయింట్లు పెరగగా, పదేళ్ల బాండ్లపై పది బేసిస్​ పాయింట్లు పెరిగాయి. 2018 నుంచి బ్యాంకు వడ్డీరేట్లతో పోలిస్తే చిన్న మొత్తాల పథకాలపై వడ్డీ ఎక్కువగా ఉంటోందని ఆర్​బీఐ 
పేర్కొంది.