అనంతపురం: తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఆయన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డిలు ఆమరణ దీక్షకు దిగుతామని ప్రకటించడంతో పోలీసులు అలర్టయ్యారు. తమపై తప్పుడు ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ జేసీ సోదరులు ఈనెల 4వ తేదీన ఆమరణ దీక్ష చేస్తామని ప్రకటించడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు తాడిపత్రిలో 30 యాక్ట్ తోపాటు.. 144 సెక్షన్ విధించారు. అదనపు పోలీసు బలగాలను తరలించి ప్రధాన కూడళ్లలో మొహరించారు. స్థానికేతరులు ఎవరూ రాకుండా తాడిపత్రికి నాలుగు దిక్కులా 20 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. నిన్నటి నుండే భారీ పోలీసు బలగాలు కవాతు నిర్వహించడంతో ఏం జరుగుతుందోనంటూ జనం బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది. జేసీ సోదలరు ఇళ్లతోపాటు.. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్ల వద్ద పోలీసు బలగాలను మొహరించారు.
ఫామ్ హౌస్ లో జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గృహ నిర్బంధం
ఉదయమే ఆమరణ దీక్షకు దిగుతామని జేసీ సోదరులు ప్రకటించిన నేపధ్యంలో పోలీసులు తెల్లవారుజామునే వారిని గృహ నిర్బంధం చేశారు. యాడికి సమీపంలోని జూటూరు వద్ద ఉన్న తన ఫామ్ హౌస్ లో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి ఉదయమే తాడిపత్రికి వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అక్కడే నిర్బంధించారు. మరో వైపు తన ఇంట్లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా ఇంట్లో నుండి బయటకు రాకుండా అడ్డుకున్నారు. హౌస్ అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. తమ వారిని హౌస్ అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి ఇంట్లో నుండి బయటకు రాకుండా అడ్డుకున్న నేపధ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమాదేవి ఎమ్మార్వోకు వినతిపత్రం ఇస్తానంటూ బయటుదేరారు. ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ తొలుత అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమె పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మార్వో ఆఫీసుకు చేరుకోగా గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. మరో వైపు తనను ఇంట్లో నుండి బయటకు రానీయకపోవడంతో ఇంట్లోనే దీక్ష చేస్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు.
ఆమరణ దీక్ష చేసే హక్కు లేదా అంటున్న జేసీ సోదరులు
తమను పోలీసులు అక్రమంగా గృహ నిర్బంధం చేశారని జేసీ బ్రదర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా తమ నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్య హక్కు అని.. దానికి కూడా తమకు అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారని మండిపడ్డారు. తాము పోలీసులకు వ్యతిరేకంగా చెప్పడం లేదని.. అంతా అధికార పార్టీ నేతలే పోలీసుల వెనుక ఉండి చేయిస్తున్నారని జేసీ బ్రదర్స్ ఆరోపించారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వారు పేర్కొన్నారు.
చట్టప్రకారమే నడుచుకుంటున్నామంటున్న పోలీసులు
తాడిపత్రిలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని… ముందు జాగ్రత్తగానే అదనపు పోలీసులు బలగాలను మొహరించామని పోలీసులు చెబుతున్నారు. తాడిపత్రి పట్టణంలో 30 యాక్ట్ తోపాటు.. 144 సెక్షన్ విధించడంతో చట్టప్రకారం నడుచుకుంటున్నామన్నారు. చట్ట ప్రకారం ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని వారు స్పష్టం చేశారు.
