శనివారం విజయవాడలో సీఎం జగన్ పై రాళ్ళ దాడి జరిగిన నేపథ్యంలో ఒకరోజు విరామం తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్ర మళ్లీ మొదలైంది. కేసరపల్లిలో విశ్రాంతి తీసుకున్న జగన్ సోమవారం ఉదయం అక్కడి నుండే యాత్ర పునః ప్రారంభించారు. జగన్ యాత్ర ప్రారంభించిన నేపథ్యంలో పలువురు వైసీపీ నేతలు జగన్ ను కలిసి పరామర్శించారు. ఈ దాడిని సీరియస్ గా తీసుకున్న పొలిసు శాఖ ప్రత్యేక బృందాలతో శరవేగంగా దర్యాప్తు చేస్తోంది.
ఈ ఘటన కారణంగా సీఎం జగన్ భద్రత విషయంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అంతే కాకుండా, ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా జగన్ కు భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ప్రస్తుతం మూడంచెల భద్రతతో బస్సు యాత్ర సాగుతోంది. అనుమానితులను బస్సు వద్దకు అనుమతించట్లేదు పోలీసులు. అంతే కాకుండా గజమాలలకు నో చెప్పిన పోలీసులు పూలు చల్లటానికి వచ్చేవారిపై నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం నిర్వహించనున్న బహిరంగ సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.