పోలీసులు, మీడియా అతిగా జోక్యం చేసుకోవద్దు :హైకోర్టు

 

  • మంచు ఫ్యామిలీ గొడవలను వాళ్లే పరిష్కరించుకుంటరు: హైకోర్టు
  • మోహన్ బాబుకు పోలీస్ విచారణ నుంచి మినహాయింపు

హైదరాబాద్, వెలుగు: కేసు విచారణకు హాజరుకావాలంటూ సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కొడుకు విష్ణుకు పోలీసులు ఇచ్చిన నోటీసుల అమలును హైకోర్టు బుధవారం నిలిపివేసింది. నోటీసుల ఆధారంగా విచారణకు హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. మంచు ఫ్యామిలీ గొడవల్లో పోలీసులు, మీడియా అతిగా జోక్యం చేసుకోవడం సరికాదని సూచించింది. వాళ్ల కుటుంబంలో మొదలైన సమస్యను.. వాళ్లే పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పించాలంది.

కాగా, వినతిపత్రం సమర్పించినా.. రక్షణ కల్పించకపోవడంతో పాటు విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ మోహన్ బాబు, విష్ణు బుధవారం అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి విచారించారు. పిటిషనర్‌‌ తరఫున అడ్వొకేట్ మురళీ మనోహర్‌‌ వాదనలు వినిపించారు.

మంచు మనోజ్‌‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడీ షరీఫ్‌‌ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారన్నారు. బౌన్సర్లతో మనోజ్‌‌ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారని, భద్రత కల్పించాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మనోజ్, మోహన్‌‌బాబు పరస్పర ఫిర్యాదులు ఇవ్వడంతో కేసులు నమోదయ్యాయన్నారు. విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చామన్నారు. వాదనలు విన్న జడ్జి.. పోలీసుల విచారణకు హాజరుకావాలంటూ ఇచ్చిన నోటీసుల అమలును నిలిపివేశారు.