తల్లిదండ్రుల ఇద్దరి సంతకం అవసరం లేదు..మైనర్ కు పాస్ పోర్టు జారీపై హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు : మైనర్ల పాస్ పోర్టు జారీకి తల్లిదండ్రుల ఇద్దరి సంతకం అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. చట్టప్రకారం మైనర్లు రక్షణలో ఉన్న సింగిల్‌ పేరెంట్‌ సంతకంతో జారీ చేయొచ్చని తెలిపింది. తండ్రి సంతకం లేకుండా పాస్‌ పోర్టు జారీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ 4 ఏండ్ల జైనాబ్‌ అలియా మహమ్మద్‌ అనే బాలిక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య విచారించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ తల్లి డాక్టర్‌ సనా ఫాతిమా భర్త అబ్దుల్‌ ఖదీర్‌కు అమెరికా పౌరసత్వం ఉందని, ప్రస్తుతం ముస్లిం చట్టం ప్రకారం వివాహం రద్దయిందని తెలిపారు.

హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని చెప్పారు. ఆమె కుమార్తె జైనాబ్ అలియా మహమ్మద్‌కు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేస్తే అమెరికాలో ఉండే తండ్రి సంతకం కావాలంటూ పాస్‌పోర్టు అధికారులు సెప్టెంబరు 10న దరఖాస్తు తిరస్కరించారని పేర్కొన్నారు. కేంద్రం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. విదేశీ పౌరసత్వం ఉన్న, భారతీయ పౌరసత్వం వదులుకున్న తల్లిదండ్రుల పిల్లల పాస్‌పోర్టు పొందడానికి నిబంధనలకు కట్టుబడి ఉండాలని వివరించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. మైనర్‌ పిల్లలకు సింగిల్‌ పేరెంట్‌ దరఖాస్తు చేయరాదంటూ 1967 పాస్‌పోర్టు చట్టం, 1980 నిబంధనల్లో ఎక్కడా నిషేధం లేదని వెల్లడించారు.

మైనర్‌ పిల్లలు ప్రత్యేక కస్టడీలో ఉన్నపుడు సింగిల్‌ పేరెంట్‌ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తును తిరస్కరించడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు విరుద్ధమన్నారు.  ప్రస్తుత కేసులో భర్త అందుబాటులో లేరని,  పిటిషనర్‌ తల్లిపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవన్నారు. అంతేగాకుండా కోర్టులో ఉన్న వివాదాలతోపాటు అన్ని పత్రాలను సమర్పించారని, బాలిక తల్లి రక్షణలోనే ఉందని, అందువల్ల బాలికకు తండ్రి సంతకంతో సంబంధం లేకుండా పాస్‌పోర్టు జారీ చేయాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను మూసేశారు.