చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడే..బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఎదురుదెబ్బ

  • పౌరసత్వంపై కేంద్రం ఉత్తర్వులు సబబేనన్న కోర్టు
  • చెన్నమనేని పిటిషన్​ డిస్మిస్.. తప్పుదోవ పట్టించినందుకు సీరియస్​
  • రూ.30 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం
  • నెలలోగా చెల్లించాలని ఆదేశం
  • చివరికి న్యాయం జరిగింది: ఆది శ్రీనివాస్​

హైదరాబాద్, వెలుగు : వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్​ నేత చెన్నమనేని రమేశ్​కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వానికి సంబంధించి కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌‌‌‌ చేస్తూ చెన్నమనేని దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను కోర్టు డిస్మిస్ చేసింది. రమేశ్​బాబు పౌరసత్వం విషయంలో కేంద్రం 2019లో ఇచ్చిన ఉత్తర్వులు సబబేనని స్పష్టం చేసింది. చెన్నమనేని రమేశ్​ జర్మనీ పౌరుడేనని తేల్చి చెప్పింది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు సీరియస్​ అయింది. జర్మనీ దేశ పౌరసత్వం ఉందన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులతో కోర్టు ఏకీభవించింది.

ఇప్పటి వరకు రమేశ్​ తప్పుడు పత్రాలతో భారత పౌరుడినని చెప్పి 15 ఏండ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగారని తప్పపట్టింది.  అవాస్తవాలతో కోర్టును తప్పుదోవ పట్టించినందుకుగానూ రూ 30 లక్షలు జరిమానా విధించింది.  ఆ మొత్తంలో రూ. 25 లక్షలను గత 15 ఏండ్లుగా న్యాయం పోరాటం చేస్తున్న పిటిషనర్‌‌‌‌ (ప్రస్తుతం కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యే) ఆది శ్రీనివాస్‌‌‌‌కు చెల్లించాలని పేర్కొన్నది. మిగిలిన మరో రూ.5 లక్షలు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. నెలలోపు చెల్లింపులు చేయాలని పేర్కొన్నది.

తప్పుడు సమాచారంతో ఎన్నికల్లో పోటీ చేశారంటూ కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థిగా ఉన్న ఆది శ్రీనివాస్‌‌‌‌ గతంలో చెన్నమనేని రమేశ్‌‌‌‌కు వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు.  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ బి.విజయ్‌‌‌‌సేన్‌‌‌‌రెడ్డి సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్నత తర్వాత సోమవారం తుది తీర్పు చెప్పారు. జర్మనీ పౌరసత్వం లేదని ధ్రువీకరించేందుకు జర్మనీ ఎంబసీ చెన్నమనేనికి ఎలాంటి పత్రాన్ని ఇవ్వలేదని గుర్తు చేశారు.  దీనికి సంబంధించిన ఆధారాలను కూడా చెన్నమనేని రమేశ్​ సమర్పించలేదని చెప్పారు.

దీనికి తోడు కేంద్రం ఇచ్చిన వివరాలను పరిశీలిస్తే  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక జర్మనీ పౌరసత్వం మీదనే 40 సార్లకుపైగా రమేశ్​ జర్మనీ వెళ్లివచ్చారన్నారు.  ఈ విషయాలపై కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ గత 15 ఏండ్లుగా రమేశ్​ ఎమ్మెల్యేగా కొనసాగారని ఆక్షేపించారు. చెన్నమనేనికి భారత పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను సమర్ధిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. కాగా, హైకోర్టు చరిత్రలో ఇదే అత్యంత భారీ జరిమానా కావడం గమనార్హం.

 2009లో మొదలైన పౌరసత్వ వివాదం

2009లో వేములవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెన్నమనేని రమేశ్​ బాబు.. కాంగ్రెస్​ అభ్యర్థి ఆది శ్రీనివాస్​పై గెలిచారు. రమేశ్​ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, తప్పుడు ధృవీకరణ పత్రాలతో భారత పౌరసత్వం పొందారని అరోపిస్తూ ఆది శ్రీనివాస్ 2009  జూన్ లో కేంద్ర హోంశాఖ కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టును అశ్రయించారు. ఇండియన్​ సిటిజన్​ షిప్​తిరిగి పొందాలంటే కనీసం 365 రోజులు ఇక్కడ ఉండాలని, ఆయన జర్మనీలో ఉంటూనే ఇక్కడ సిటిజన్​షిప్​ పొందారని కోర్టులో కేసు వేశారు. ఆ కేసు కొనసాగుతుండగానే రమేశ్​​బాబు బీఆర్ఎస్​ నుంచి 2010 ఉప ఎన్నికల్లోనూ, 2014 , 2018లోనూ పోటీ చేసి గెలిచారు.

రమేశ్​ బాబుకు కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న పలుకుబడితో కేసును ఇంతకాలం ఎటూతేలకుండా నెట్టుకొచ్చారన్న వాదనలున్నాయి. ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉండడంతో 2023లో బీఆర్ఎస్​ఆయనకు టికెట్ ఇవ్వలేదు. రమేశ్​​బాబు పౌరసౌత్వం రద్దు చేసి, రెండో స్థానంలో ఉన్న తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని 2010,2014,2018 లో ఆది శ్రీనివాస్​ వేసిన ఎలక్షన్​పిటిషన్లు కూడా పెండింగ్​లోనే ఉన్నాయి. 

ఉమ్మడి హైకోర్టులో ఓ సారి తీర్పు..

 పౌరసత్వం కేసులో ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు 2013లోనే ఒకసారి తీర్పు వెలువరించింది. రమేశ్​చట్టవిరుద్ధంగా భారత పౌరసత్వాన్ని పొందారని భావించిన కోర్టు ఆయన ఎమ్మెల్యే పదవిని, భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఓటర్ లిస్టులో ఆయన పేరు తొలగించాలని ఆదేశించింది. దీంతో చెన్నమనేని రమేశ్​ సుప్రీంకోర్టును ఆశ్రయించి, స్టే తెచ్చుకున్నారు. పౌరసౌత్వం వివాదాన్ని తేల్చాలని కేంద్రహోం శాఖకు సుప్రీం కోర్టు సూచించింది.

త్రీ మెన్ కమిటీ వేసి విచారణ చేయాలని హోంశాఖను కోరింది. త్రీమెన్ కమిటీ పూర్తిగా విచారించి.. రమేశ్​బాబు పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తులో విదేశీ ప్రయాణాలకు సంబంధించిన వివరాలను దాచిపెట్టారని, భారత ప్రభుత్వాన్ని మోసగించారని కమిటీ రిపోర్ట్​లో పేర్కొనడంతో .. కేంద్ర హోంశాఖ ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. 

న్యాయం జరిగింది 

 రమేశ్​బాబు పౌరసౌత్వం పై ఇంతకాలం పోరాడా. చివరగా హైకోర్టులో న్యాయం జరిగింది. ఒకవైపు కేసు నడుస్తుండగానే జర్మనీ పాస్​ పోర్టుపై 45 సార్లు రమేశ్​ ప్రయాణం చేశాడు. ప్రజలను, కోర్టులను తప్పుదోవ పట్టించాడు. చట్టాలను, భారతదేశ ప్రభుత్వాన్ని మోసం చేశాడు. నేను ధర్మపోరాటం చేస్తుంటే అవహేళనలకు, అవమానాలకు గురి చేశారు. చెన్నమనేని కుటుంబమంటే మచ్చలేని కుటుంబం అన్నాడు. ఇప్పుడు రమేశ్​బాబు ఏం సమాధానం చెబుతాడు ? – ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే, వేములవాడ​

ప్రజలను రమేశ్ బాబు మోసం చేసిండు: పీసీసీ చీఫ్​

రమేశ్ బాబు పౌరసత్వంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ స్వాగతించారు. రమేశ్​కు జర్మనీ పౌరసత్వం ఉన్నప్పటికీ, నిజాన్ని దాచిపెట్టి.. న్యాయ వ్యవస్థను, ప్రజలను  మోసం చేశారని ఆయన అన్నారు. కోర్టు రూ. 30 లక్షల జరిమానా విధించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. దొడ్డిదారిన ప్రజాప్రతినిధిగా చలామణి అయిన రమేశ్ బాబుపై చేసిన న్యాయ పోరాటంలో చివరకు ఆది శ్రీనివాస్​నే గెలిచారని చెప్పారు. 

హైకోర్టు తీర్పు నిరాశపరిచింది

 ఈ రోజు హైకోర్టులో నా పౌరసత్వం పై వెలువడిన తీర్పు తీవ్రంగా నిరాశపరిచింది. ఈ తీర్పు హేతుబద్ధంగా లేదు. ఇది ప్రధానంగా 2019 లో తెలంగాణ హైకోర్టు పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 10(3)ని తు.చ తప్పకుండా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ ను ఆదేశించిన నేపథ్యానికి వర్తిస్తుంది.  వరుస ఓటములు జీర్ణించుకోలేకే కొందరు  నా పౌరసత్వంపై కేసులు వేశారు.  వీటన్నింటినీ నేను హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విజయవంతంగా ఎదుర్కొన్నా. ప్రస్తుత తీర్పు పై కోర్టుకు వెళ్లే అవకాశాన్ని మా లాయర్లు పరిశీలిస్తున్నారు.    – చెన్నమనేని రమేశ్, వేములవాడ మాజీ ఎమ్మెల్యే