మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబుకు నో బెయిల్.. ముందస్తు బెయిలుకుహైకోర్టు నిరాకరణ

  • కౌంటర్​ దాఖలు చేయాలనిపోలీసులకు ఆదేశం
  • ఇంకా గన్​ డిపాజిట్​ చేయని మోహన్​బాబు

హైదరాబాద్, వెలుగు: జర్నలిస్ట్​పై దాడి కేసులో సినీ నటుడు మోహన్‌‌ బాబుకు ముందస్తు బెయిలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఫిర్యాదులో ఆరోపణల తీవ్రత ఉన్న నేపథ్యంలో అరెస్ట్‌‌ నుంచి ఎలాంటి మినహాయింపులు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అలాగే, కౌంటర్​ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. జర్నలిస్ట్​పై దాడికి సంబంధించి నమోదైన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ మోహన్‌‌బాబు శుక్రవారం ఉదయం లంచ్‌‌మోషన్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫు అడ్వకేట్ ఎన్‌‌.అశ్వనీ కుమార్‌‌ వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 10న జరిగిన ఘటనలో నమోదైన కేసును పోలీసులు సవరించారని, హత్యాయత్నం కింద మార్చారన్నారు. పిటిషనర్‌‌ కుటుంబ వివాదంపై మీడియా ట్రయల్‌‌ జరుగుతోందని, ఫిర్యాదుదారుతోపాటు అసాంఘిక శక్తులు, బౌన్సర్లు ఇంటిలోపలికి చొచ్చుకువచ్చి ధ్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకున్నారన్నారు.

ఈ పిటిషన్‌‌పై విచారణ ముగిసేదాకా అరెస్ట్‌‌ చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. అదనపు పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్‌‌ జితేందర్‌‌రావు వీరమల్ల వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌‌ కుమారుడు మనోజ్‌‌ ఆహ్వానం మేరకే జర్నలిస్టులు వెళ్లారన్నారు. లోగో ఉన్న మైక్‌‌తో కొట్టడంతో సున్నితమైన ప్రాంతంలో తీవ్రగాయమైందన్నారు. సర్జరీ కూడా జరిగిందని, బాధితుడి నుంచి వాంగ్మూలం తీసుకుని సెక్షన్‌‌లను సవరించినట్టు తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరిస్తూ.. పోలీసులు కౌంటరు దాఖలు చేసిన తరువాత ఈ పిటిషన్‌‌పై తేల్చుతామంటూ విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు.

మోహన్‌‌ బాబు గన్‌‌ ఎక్కడ?

సినీ నటుడు మోహన్‌‌ బాబు కుటుంబ కలహాల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంచు మనోజ్‌‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం పోలీసులు జల్‌‌పల్లిలోని మోహన్‌‌ బాబు ఫామ్‌‌హౌస్‌‌కు వెళ్లారు. అతని లైసెన్స్​గన్‌‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయన స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్ చేసేందుకు యత్నించారు.

కానీ, ఫామ్‌‌హౌస్‌‌లో ఆయన అందుబాటులో లేరు. దీంతో ఎక్కడికెళ్లాడనే వివరాలు సేకరించారు. మంచు మనోజ్‌‌ ఇంట్లో ఉన్నట్టు తెలుసుకున్నారు. గన్‌‌ డిపాజిట్ చేయాలని సూచించారు. అయితే, రెండు రోజుల్లో డిపాజిట్ చేస్తానని మోహన్‌‌బాబు వెల్లడించినట్టు తెలిసింది. దీంతో మోహన్‌‌ బాబు గన్‌‌ ఎక్కడ ఉందనేది చర్చనీయాంశంగా మారింది.