ఫార్ములా ఈ రేసింగ్ కేసులో తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు

ఫార్ములా ఈ రేసింగ్ కేసులో  కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. క్వాష్ పిటిషన్ పై న్యాయస్థానం  తీర్పు రిజర్వు చేసింది. తీర్పు వెల్లడించేవరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని  హైకోర్టు ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది.

ఫార్మూలా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పటిషన్ వాదనలు వాడీవేడిగా ముగిశాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరుఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు.  ఏసీబీ తరుఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. అసలు ఈ కేసులో కేటీఆర్ పై అభియోగాలు ఏంటని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. ఫార్మూలా ఈ కార్ రేస్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించడంతో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిందని పీపీ కోర్టుకు వివరించారు. 

ALSO READ | కొత్త సంవత్సరంలో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం తీపి కబురు.. సీఎం కీలక ప్రకటన చేసే డేట్ ఫిక్స్..

అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత సెక్షన్ల  కింద కేసు ఫైల్ చేసినట్లు తెలిపారు. ఐఏఎస్ అధికారి దాన కిశోర్ ఫిర్యాదు మేరకు కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిందని పీపీ న్యాయస్థానానికి వెల్లడించారు. మరీ ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చారా అని పీపీని న్యాయస్థానం ప్రశ్నించింది. ఎఫ్ఈవో వివరాలను కేటీఆర్ తరుఫు న్యాయవాది సిద్ధార్థ్ దవే కోర్టుకు వివరించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఫార్మూలా ఈ కార్ రేసింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఫార్మూలా ఈ కార్ రేసింగ్ ఇష్యూపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. అప్పటి మంత్రి కేటీఆర్ ను ఏ1 నిందితుడిగా పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించారని కేటీఆర్‎పై అభియోగాలు మోపింది. ఈ కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టు ఆశ్రయించారు.