గేటెడ్ కమ్యూనిటీలకు గైడ్​లైన్స్ రూపొందించండి.. పోలీసులు, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు:  గేటెడ్‌‌ కమ్యూనిటీల్లో అక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు గైడ్‌‌లైన్స్‌‌ జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే హైదరాబాద్ పోలీస్ యాక్ట్ కింద తీసుకునే చర్యల గురించి వివరిస్తూ పోలీసులు కూడా ఆయా విల్లాల అసోసియేషన్లకు గైడ్ లైన్స్ జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. 

గేటెడ్‌‌ కమ్యూనిటీల్లో జరిగే అసాంఘిక, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అరికట్టేందుకు సిటీ పోలీస్ యాక్ట్ కింద చర్యలు చేపట్టే అధికారం పోలీసులకు ఉందని తేల్చి చెప్పింది. హైదరాబాద్‌‌ కేపీహెచ్‌‌బీలోని ఇందూ ఫార్చ్యున్‌‌ ఫీల్డ్‌‌ విల్లాల కమ్యూనిటీలో అక్రమంగా పేకాట, మద్యం, మత్తు పదార్థాల వినియోగం, లైంగిక చర్యలపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్‌‌ చేస్తూ  సీహెచ్‌‌ హరిగోవింద ఖోరానా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌ను ఇటీవల విచారించిన హైకోర్టు జడ్జి జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 

పిటిషనర్‌‌ న్యాయవాది వాదిస్తూ.. చట్ట వ్యతిరేక యాక్టివిటీలపై పోలీసులకు ఫోన్, వాట్సాప్‌‌ ద్వారా, రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. అంతేకాకుండా కమ్యూనిటీలోని వారు పిటిషనర్‌‌పై దాడి చేశారన్నారు. అసోసియేషన్‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ.. హైకోర్టు ఆదేశాల మేరకు అత్యవసర జనరల్‌‌ బాడీ సమావేశం నిర్వహించి పలు తీర్మానాలు చేశామన్నారు. సబ్‌‌ కమిటీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. క్లబ్‌‌ హౌస్‌‌ను వాడుకునే వాళ్ల గుర్తింపు కార్డులను సేకరించాలని నిర్ణయించామన్నారు. అయితే, గేటెడ్‌‌ కమ్యూనిటీలను నియంత్రించడం పోలీసులకు సాధ్యం కాదని, కోర్టు ఆదేశాలిస్తే చర్యలకు వీలుంటుందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.  

విల్లాల్లో సబ్ కమిటీలు వేయాలి.. 

ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం జడ్జి స్పందిస్తూ.. తగిన గైడ్ లైన్స్ రూపొందించాలని పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. గేటెడ్ కమ్యూనిటీల్లో న్యూసెన్స్, నేరాలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు కమ్యూనిటీలకు అందినట్లయితే తక్షణం చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీసు స్టేషన్‌‌లు, టాస్క్‌‌ఫోర్స్, టీఎన్‌‌సీబీలకు కూడా సిటీ పోలీస్ కమిషనర్‌‌ తగిన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదుల స్వీకరణకు సాధ్యమైతే యాప్ ను కూడా రూపొందించాలని తెలిపారు. అలాగే విల్లాల్లో సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలతో సబ్ కమిటీలు కూడా వేయాలని హైకోర్టు  ఆదేశించింది.