ప్రజల వద్దకే న్యాయసేవలు

  • మెదక్ జిల్లా న్యాయస్థానాల పనితీరు బేష్​ 
  • హై కోర్ట్ జడ్జి జస్టిస్ విజయసేన్ రెడ్డి కితాబు   
  • అల్లాదుర్గంలో కొత్త కోర్టు ప్రారంభం

మెదక్​, అల్లాదుర్గం, పాపన్నపేట, వెలుగు: ప్రజల గుమ్మం వద్దకు న్యాయ సేవలు తీసుకెళ్లాలని హైకోర్టు జడ్జి జస్టిస్​విజయసేన్​రెడ్డి అన్నారు. మెదక్​ జిల్లా అల్లాదుర్గంలో కొత్తగా ఏర్పాటైన సివిల్​కోర్టు కాంప్లెక్స్​ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం రీటా లాల్ చంద్ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జస్టిస్​ విజయసేన్​ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు ఈ ప్రాంత వాసులకు సత్వర న్యాయం అందించే దిశగా న్యాయస్థానం ఏర్పాటు చేశామన్నారు.

 అల్లాదుర్గంలో కొత్త సివిల్ కోర్టును ప్రారంభించుకోవడం వల్ల రేగోడు, శంకరంపేట్, అల్లాదుర్గం ప్రాంత వాసులకు, పేద ప్రజలకు సత్వర న్యాయం దొరుకుతుందన్నారు. కొత్త చట్టాలు తీసుకురావడం ప్రజలకు చాలా మంచిదన్నారు. జీవితంలో పైకి రావాలంటే ప్రశాంతమైన జీవితం అలవాటు చేసుకోవాలని సూచించారు. 

సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారం మెయింటెనెన్స్, కేసులు  త్వరగా పరిష్కారం చేయాలని, చైల్డ్ కస్టడీ, విడాకులు, క్రిమినల్ సంబంధించిన కేసులు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. మార్పుతోనే సమాజం ముందుకు పోతుందన్నారు. సివిల్ కేసులు పరిష్కరించే విషయంలో లాయర్లు నిర్భయంగా నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో లీగల్ సర్వీస్ అథారిటీ విజయపథంలో ముందుకు పోతుందని తెలిపారు. తాను మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల వాసినేనని, తనకు ఈ జిల్లాతో ఉన్న అనుబంధం చాలా గొప్పదని గర్వంగా చెప్పారు. 

ఏడుపాయల, చర్చి సందర్శన

అంతకు ముందు హైకోర్టు జడ్జి జస్టిస్​ విజయసేన్​రెడ్డి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన పూజారులు, వేదాశీర్వచనాలు అందించి, ఆలయ మర్యాదలతో సత్కరించారు. అ తర్వాత ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మెదక్ చర్చిని సందర్శించారు. 

కార్యక్రమంలో మెదక్ జిల్లా జడ్జి లక్ష్మీశారద, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్,  సీనియర్ సివిల్ జడ్జి  జితేందర్, నర్సాపూర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అనిత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ గౌడ్,  జనరల్​సెక్రెటరీ శ్రీపతిరావు, అడ్వకేట్స్​ప్రతాప్​రెడ్డి, జనార్దన్ రెడ్డి, బాలయ్య పాల్గొన్నారు.