రేవతి చనిపోయిందని తెల్లారే తెలిసింది

  • సంధ్య టాకీస్ వద్ద తొక్కిసలాట దురదృష్టకరం: అల్లు అర్జున్ 
  • తప్పుడు ఆరోపణలతో నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నరు 
     
  •  శ్రీ తేజ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా 
  •  హాస్పిటల్​కు వెళ్దామంటేలాయర్ వద్దన్నరని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని, ఈ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హీరో అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో రేవతి చనిపోయిందని ఆ తర్వాతి రోజే తనకు తెలిసిందన్నారు. థియేటర్ బయట అలాంటి ఘటన జరిగిందని తెలియక పిల్లలతో కలిసి సినిమా చూశానని, కానీ తొక్కిసలాట గురించి తెలిసి కూడా తాను సినిమా చూశానని తప్పుడు ప్రచారం చేశారన్నారు. 

శనివారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో తన తండ్రి అల్లు అరవింద్, అడ్వకేట్ తో కలిసి అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది ఒక యాక్సిడెంట్. ఇందులో ఎవరి తప్పూ లేదు. కానీ ఈ అంశంలో నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. “అంతా మంచి జరగాలనుకున్నా, మిస్ కమ్యూనికేషన్ వల్ల అనర్థం జరిగింది. ప్రభుత్వంతో మేం ఎలాంటి వివాదం పెట్టుకోవాలని అనుకోవడం లేదు. అనుకోని ప్రమాదం జరిగింది. ఈ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నా.

శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా. ఇప్పటికే మా నాన్న శ్రీతేజ్ ను పరామర్శించారు. అతడు కోలుకోవాలని కోరుకుంటున్నా”అని అన్నారు. ‘‘మూడేండ్లు కష్టపడ్డ సినిమా ఎలా ఉందో చూద్దామని థియేటర్‌‌కు వెళ్లాను. పోలీసుల డైరెక్షన్‌‌లోనే ముందుకు సాగాను. వాళ్లే ట్రాఫిక్‌‌ క్లియర్ చేశారు. నేను రోడ్‌‌షో, ఊరేగింపు చేయలేదు. అంతమంది ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను కారులో కూర్చుంటే గర్వం ఉందని అనుకుంటారు. అందుకే బయటకు వచ్చి చేతులు ఊపాను. థియేటర్‌‌లో పోలీసులెవరూ నన్ను కలవలేదు. మా వాళ్లు చెబితేనే నేను వెళ్లిపోయాను” అని అల్లు అర్జున్ చెప్పారు. 

నాకూ అంతే వయసు కొడుకున్నడు.. 

తొక్కిసలాట జరిగిన తరవాతి రోజు హాస్పిటల్‌‌కు వెళ్దామంటే వద్దని తమ వాళ్లు చెప్పారని అల్లు అర్జున్ తెలిపారు. ‘‘వాళ్లను కలవాలని నాకు ఉండదా? న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయనే వెళ్లలేదు. ఆ తర్వాత ఒక వీడియో పెట్టాను. డబ్బులు ఇస్తానని చెప్పాను. 

నేను తండ్రిని కాదా.. నాకూ అంతే వయస్సున్న కొడుకు ఉన్నాడు”  అని అన్నారు. “నేను ఏ పొలిటికల్ లీడర్‌‌ని గానీ, పోలీసులను గానీ, ప్రభుత్వాన్ని గానీ బ్లేమ్ చేయడం లేదు. మాకు థియేటర్లలో స్పెషల్ ప్రైస్ ఇచ్చారు. ఆ విషయంలో హ్యాపీగానే ఉన్నాం. సినిమా పెద్ద సక్సెస్ అయినా ప్రస్తుత పరిస్థితిని బట్టి పబ్లిక్ ఫంక్షన్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేసుకున్నా”  అని ఆయన తెలిపారు.